టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత క్రికెట్‌కు బుమ్రా రత్న కిరీటమని కొనియాడాడు. టీమిండియాలోనే బుమ్రా అత్యుత్తమ ఫిట్‌నెస్ కలిగిన ప్లేయర్ అని, ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని అభిప్రాయపడ్డాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌తో పాటు బుమ్రా, రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ.. టీమిండియాలో తానే అత్యుత్తమ ఫిట్‌నెస్ కలిగి ఉన్నట్లు పేర్కొన్నాడు.

అయితే ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఎప్పుడూ గాయపడే బుమ్రా అత్యుత్తమ ఫిట్‌నెస్ ఎలా కలిగి ఉన్నాడని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అశ్విన్ తన యూట్యూబ్ షోలో చురకలు అంటించాడు. 'జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణమైన ఫాస్ట్ బౌలర్. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తాడు.
భారత క్రికెట్‌కు అతను రత్నకిరీటం. కోహ్లీనూర్ డైమండ్ కూడా. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పనివ్వండి. కపిల్ దేవ్ తర్వాత బుమ్రా కంటే మెరుగైన స్టార్ పేసర్ ఉన్నాడా? ఇక్కడ ఇతర బౌలర్లను తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. బుమ్రా తరుచూ గాయాలపాలవుతూ ఉంటాడు.
అలాంటి క్రికెటర్ అత్యుత్తమ ఫిట్‌నెస్ కలిగిన క్రికెటర్ అని ఎలా చెబుతాడు? అని చాలా మంది ప్రశ్నించారు. కానీ, ఆ రెండింటికి చాలా తేడా ఉంది.ఉదాహరణకు టిప్పర్ లారీ, మెర్సిడెస్ బెంజ్‌ల డ్రైవింగ్ చాలా విభిన్నంగా ఉంటుంది. బెంజ్ కార్‌ను చాలా జాగ్రత్తగా నడుపుతాం. కానీ టిప్పర్ లారీ దేశం మొత్తం తిరుగుతోంది.

భారీ లోడ్‌ను మోసుకెళ్తోంది. ఫాస్ట్ బౌలర్ కూడా టిప్పర్ లారీ లాంటోడే. ఒక్కోసారి బ్రేక్ డౌన్ అవుతుంది. బుమ్రా కూడా గాయాల నుంచి కోలుకొని వచ్చి 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి, అతను అత్యుత్తమ ఫిట్‌నెస్ కలిగిన ప్లేయర్ అనడంలో తప్పు లేదు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
బుమ్రా ఏమన్నాడంటే..?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బుమ్రాను టీమిండియాలో అత్యుత్తమ ఫిట్‌నెస్ కలిగిన ప్లేయర్ ఎవరని ప్రశ్నించారు. ఇందుకు కోహ్లీ పేరు చెబుతాడని సదరు హోస్ట్ భావించాడు. కానీ బుమ్రా మాత్రం తానే అత్యుత్తమ ఫిట్‌నెస్ కలిగిన ప్లేయర్‌నని బదులిచ్చాడు. 'నేను కోహ్లీ పేరు చెబుతానని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు.
కానీ నేను అత్యుత్తమ ఫిట్‌నెస్ కలిగిన ప్లేయర్ ఎవరు అంటే.. నా పేరే చెబుతా. ఎందుకంటే నేను పేస్ బౌలర్‌ను. దేశం కోసం క్లిష్ట పరిస్థితుల్లో పేసర్‌గా రాణించాలంటే చాలా అంశాల్లో మెరుగ్గా ఉండాలి. అందులో ఫిట్‌నెస్ కూడా కీలకం. అందుకే నేనెప్పుడూ ఒక ఫాస్ట్ బౌలర్‌గా ఫిట్‌గా ఉంటానని చెబుతున్నా'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.