పాపం ఓలీ రాబిన్‌సన్.. చాలా బాధగా ఉంది: అశ్విన్

లండన్: ఎనిమిదేళ్ల క్రితం మిడిమిడి జ్ఞానంతో చేసిన తప్పిదానికి ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్సన్ ఇప్పుడు వాటి పర్యావసానాలు ఎదుర్కొంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 27 ఏళ్ల రాబిన్సన్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే దుమ్ములేపాడు. అదే అతని పాలిట శాపమైంది. మ్యాచ్ ఫస్ట్ డేనే స్టన్నింగ్స్ పెర్ఫామెన్స్ కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించిన రాబిన్సన్ చిక్కుల్లో పడ్డాడు.
అప్పుడెప్పుడో 2013లో సోషల్ మీడియా వేదికగా స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలతో పాటు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అయితే రాబిన్సన్ స్టన్నింగ్ పెర్ఫెమెన్స్ నేపథ్యంలో అప్పటి పోస్ట్‌లన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాబిన్సన్‌పై విచారణ చేపట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతన్ని వెంటనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. రెండో టెస్టులో అతను ఆడడని తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన వెంటనే బోర్డు స్పష్టం చేసింది.

చింతిస్తున్నా..
ఈ వ్యవహారంపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ట్విటర్ వేదికగా ఓలీ రాబిన్సన్‌కు మద్దతు తెలుపుతూనే.. సోషల్ మీడియాలో ఒళ్లు దగ్గర పెట్టుకోని ప్రవర్తించాలని ఈ తరం ఆటగాళ్లను హెచ్చరించాడు. 'కొన్నేళ్ల క్రితం ఓలీ రాబిన్సన్ చేసిన ట్వీట్లలోని ప్రతికూల భావాలను నేను అర్థం చేసుకోగలను. కానీ అతని టెస్ట్ కెరీర్‌లో అద్భుతమైన ఆరంభం తర్వాత అతన్ని సస్పెండ్ చేయడం బాధగా ఉంది. ఈ సోషల్ మీడియా యుగంలో ఈ జనరేషన్‌కు ఇదో ఘటన హెచ్చరిక'అని అశ్విన్ ట్వీట్ చేశాడు. తొలి టెస్టులో ఓలీ రాబిన్సన్ 7 వికెట్లతో పాటు 42 రన్స్ కూడా చేశాడు.

క్షమించండి..
ఈ వ్యవహారంపై రాబిన్సన్ క్షమాపణలు చెప్పాడు. 'నేను జాత్యహంకారిని, సెక్సిస్ట్‌ని కాదని స్పష్టం చేయాలనుకుంటున్నా. నా తప్పిదంకు తీవ్రంగా చింతిస్తున్నా. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడుతున్నా. ఆ సమయంలో నేను ఆలోచనా రహితంగా, బాధ్యతారహితంగా ఉన్నా. నా మానసికస్థితి సరిగా లేదు. నా చర్యలు క్షమించరానివి. ఆ ట్వీట్లకు పూర్తిగా చింతిస్తున్నా.ఇపుడు నేను ఒక వ్యక్తిగా పరిణతి చెందా' అని రాబిన్సన్ పేర్కొన్నాడు. ఓలీ రాబిన్సన్ క్షమాపణ చెప్పినప్పటికీ.. ఈసీబీ అతనిపై చర్యలు తీసుకుంది.

ఫస్ట్ టెస్ట్ డ్రా..
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ గట్టెక్కింది. లార్డ్స్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసాంతం వెనుకబడినా చివరకు మ్యాచ్‌ను రూట్ సేన 'డ్రా' చేసుకోగలిగింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్య చేదనలో ఆదివారం ఐదో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్లకు 170 రన్స్ చేసింది. ఓపెనర్ డామ్ సిబ్లే (207 బంతుల్లో 60 నాటౌట్) చివరి వరకు నిలువగా.. కెప్టెన్ జో రూట్ (40) రాణించాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన న్యూజిలాండ్ నయా ఓపెనర్ డేవాన్ కాన్వె ( 347 బంతుల్లో 22 ఫోర్లు, సిక్స్‌తో 200)కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications