
కాన్పూర్: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా గుర్తింపు పొందిన రవిచంద్రన్ అశ్విన్.. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించాడు. అయితే ఈ ఘనతను అందుకోవడం సంతోషాన్నిచ్చినప్పటికీ.. గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నాడు. మైలురాళ్లు అనేవి ఎప్పటికప్పుడూ మారిపోతుంటాయని, వీటికన్నా కెరీర్‌లో మంచి జ్ఞాపకాలు మిగుల్చుకోవడం మంచిదన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు.
హర్భజన్ 103 టెస్టుల్లో 417 వికెట్లు తీయగా.. అశ్విన్ 80 మ్యాచ్‌ల్లోనే 419 వికెట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక దిగ్గజాలు అనిల్ కుంబ్లే (132 టెస్టుల్లో 619 వికెట్లు), కపిల్ దేవ్ (131 టెస్టుల్లో 434 వికెట్లు) మాత్రమే అశ్విన్ కన్నా ముందున్నారు. కపిల్‌ను అశ్విన్ అధిగమించడం లాంఛనమే అయినా.. కుంబ్లేను దాటాలంటే మరో నాలుగైదేళ్లు జట్టులో కొనసాగుతూ.. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చెయ్యాలి.
ఇక భజ్జీ రికార్డును అధిగమించడంపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన అశ్విన్... ఇందులో స్పందించడానికి ఏమీ లేదన్నాడు. 'హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించడంపై చెప్పడానికి ఏమీ లేదు. మైలురాళ్లు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఇది సంతోషకరమైన విషయమే. పదేళ్లు క్రికెట్ ఆడాక ఎన్ని వికెట్లు తీశామన్నది కాదు.. మనకు ఎన్ని మంచి జ్ఞాపకాలున్నాయన్నది ముఖ్యమని కోచ్‌గా వచ్చాక ద్రవిడ్ భాయ్ చెప్పాడు.
వచ్చే మూణ్నాలుగేళ్లలో అలాంటి మరిన్ని జ్ఞాపకాలను పోగు చేసుకోవాలనుకుంటున్నా'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరోవైపు అశ్విన్ తన రికార్డును అధిగమించడంపై హర్భజన్ స్పందించాడు. అతనికి అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇలాంటి రికార్డులు మరిన్ని సాధించాలని ఆకాంక్షించాడు. మున్ముందు కూడా ఇలాగే రాణిస్తూ కొనసాగాలని ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై తొలి టెస్టు చివరి రోజు మిగిలిన తొమ్మది న్యూజిలాండ్ వికెట్లు తీసి సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందనుకున్న భారత్ చివరకు 'డ్రా'తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోమవారం ఆట ముగిసే సమయానికి కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (146 బంతుల్లో 52; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అయితే రచిన్ రవీంద్ర (91 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు), ఎజాజ్ పటేల్ (23 బంతుల్లో 2 నాటౌట్) కలిసి భారత్‌కు చివరి వికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. వెలుతురు తగ్గడంతో నిర్ణీత సమయంకంటే 12 నిమిషాల ముందే (కనీసం మరో 3 ఓవర్లు పడేవి) అంపైర్లు ఆటను నిలిపివేశారు. టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలవగా... రెండో టెస్టు శుక్రవారం నుంచి ముంబైలో జరుగుతుంది.