ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా 36 పరుగులకు ఆలౌటై చెత్త రికార్డ్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రికార్డ్‌గా నిలిచిపోయింది.
కొసమెరుపు ఏంటంటే.. ఈ ఘోర పరాభావం నుంచి తేరుకున్న టీమిండియా అసాధారణ ప్రదర్శనతో ఏకంగా 2-1తో సిరీస్ కైవసం చేసుకొని నయా చరిత్రను లిఖించింది. టీమిండియా 36 పరుగులకు కుప్పకూలడం.. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి ప్రసవం కోసం భారత్‌కు వచ్చేయడంతో సిరీస్ గెలవడం కష్టమని అంతా అనుకున్నారు.

కానీ అజింక్యా రహానే సారథ్యంలోని టీమిండియా అసాధారణ ప్రదర్శనతో మెల్‌బోర్న్ టెస్ట్ గెలిచి.. సిడ్నీ టెస్ట్‌ను డ్రా చేసుకుంది. నిర్ణయాత్మక బ్రిస్బేన్ టెస్ట్‌కు సీనియర్ ఆటగాళ్లంతా దూరమైనా కుర్రాళ్ల సాయంతో విజయం సాధించి సరికొత్త చరిత్రను లిఖించింది.
తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 36 పరుగులకు ఆలౌటైన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ ఇన్నింగ్స్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ పూర్తిగా నిరాశాలోకి కూరుకుపోయిందని, అసలు టెస్ట్ సిరీస్ గెలవాలనే ఆలోచన కూడా చేయలేదన్నాడు.
అయితే ఆ ఘోర పరాజయం ఎదురైన రాత్రి.. రవిశాస్త్రి డిన్నర్ పార్టీ ఇచ్చాడని, తన పాటలతో ఆటగాళ్లలో ఉత్సాహాన్ని తీసుకొచ్చాడని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. అతను ఇచ్చిన పార్టీ కారణంగానే ఈ సిరీస్‌లో విజయం సాధించగలిగామని చెప్పుకొచ్చాడు. '36 పరుగులకు ఆలౌటైన తర్వాత మేం సిరీస్ గెలవడం గురించి కూడా ఆలోచన చేయలేదు. ఎందుకంటే జట్టు మొత్తం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. కానీ ఆ రాత్రి రవి భాయ్ టీమ్ డిన్నర్ ఏర్పాటు చేశారు.
అతనే కరోకే(మ్యూజిక్ సాధనం)ను ఆన్ చేసి తన పాటలతో అలరించాడు. ఓటమి బాధ నుంచి తేరుకునేలా చేశాడు. ఆ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ జట్టును వీడి స్వదేశం వెల్లిపోయాడు. దాంతో మేం సానుకూల దృక్పథంతో ఆడాలని నిర్ణయించుకున్నాం. సిరీస్ గెలవాలని ఏ మాత్రం అనుకోలేదు. చిన్న లక్ష్యాలతో ముందుకు సాగాం. మ్యాచ్ గెలవడమే టార్గెట్‌గా పెట్టుకున్నాం. ముందుగా మెల్ బోర్న్ టెస్ట్ గెలిచాం. చివరి వరకు అదే స్ఫూర్తిని కొనసాగించి విజేతలుగా నిలిచాం. 'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(74) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఆస్ట్రేలియా 191 పరుగులకు కుప్పకూలింది. దాంతో టీమిండియాకు 53 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్(5/8), ప్యాట్ కమిన్స్ (4/21) నిప్పులు చెరగడంతో 21.2 ఓవర్లలో 36 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో మహమ్మద్ షమీ తీవ్రంగా గాయపడటంతో అతను బ్యాటింగ్‌కు రాలేదు.