ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియాను ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో ఓడించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 26 ఓవర్లకే కుదించారు. సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా నిరాశపర్చాడు. ఈ ముగ్గురి వైఫల్యంతో పాటు వర్షం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.
అయితే గంభీర్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే టీమిండియా ఓటమిపాలైందని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. తొలి వన్డేలో బరిలోకి దిగిన టీమ్ కాంబినేషన్‌ను అశ్విన్ తప్పుబట్టాడు. జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఎందుకని ప్రశ్నించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడం టీమిండియా చేసిన ఘోర తప్పిదమని మండిపడ్డాడు.

తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలని సూచించాడు. 'నితీష్ రెడ్డితో పాటు ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు ఆడిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. బ్యాటింగ్ డెప్త్ కోసమే స్పిన్ ఆల్‌రౌండర్లు అయిన వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. కానీ బౌలింగ్‌పై కూడా కొంత దృష్టి పెట్టాలి. ఈ పెద్ద మైదానాల్లో కుల్దీప్ యాదవ్ స్వేచ్ఛగా బౌలింగ్ చేయలేకపోతే.. ఇంకెక్కడ చేస్తాడు? ఆసీస్‌లో ఓవర్ స్పిన్ ఉంటుంది. బౌన్స్ పొందడానికి కూడా సహాయపడుతుంది.
బ్యాటింగ్ డెప్త్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారంటే.. బ్యాటర్లకు బ్యాకప్ ఇస్తున్నట్లే. ఎందుకంటే పరుగులు చేయాల్సిన బాధ్యత బ్యాటర్లదే. కానీ ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను ఆడిస్తున్నారంటే.. బ్యాటర్లపై నమ్మకం లేకనే కదా? ఉత్తమ బౌలర్లను ఆడించండి. నా సలహా ఇదే. బ్యాటింగ్ డెప్త్‌కు ప్రాధాన్యత ఇస్తూ టీమ్ కాంబినేషన్‌ను నిర్ణయించవద్దు.
జట్టులో ఎంత మంది ఆల్‌రౌండర్లు కావాలి? ఇప్పటికే మీకు ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఒకప్పుడు జట్టులో ఆల్‌రౌండర్లే ఉండేవారు కాదు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లున్నా.. అత్యుత్తమ స్పిన్నర్‌ను ఆడించకపోతే ఎలా?'అని అశ్విన్ ప్రశ్నించాడు.