ఆసియా కప్ 2025 టోర్నీపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీతో ఉపయోగమే లేదని, భారత్‌కు గట్టి పోటీనిచ్చే జట్లే లేవన్నాడు. కనీసం సౌతాఫ్రికా, భారత్-ఏ జట్లను అయినా చేర్చి ఉంటే టోర్నీ రసవత్తరంగా సాగేదని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025 టోర్నీ మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్, హాంగ్ కాంగ్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది.
బుధవారం ఆతిథ్య యూఏఈతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలోనే అశ్విన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆసియా కప్ 2025లో అసలు సిసలు పోటీ ఎక్కడా? అని అశ్విన్ ప్రశ్నించాడు. రోజు రోజుకు ఈ టోర్నీ ప్రమాణాలు పడిపోతున్నాయంటూ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహకంగా ఈ టోర్నీని ఉపయోగపడుతుందని అనుకోవడం సరికాదన్నాడు.

'ఆసియా కప్ టోర్నీని మరింత రసవత్తరంగా మార్చాలంటే చాలా మార్పులు చేయాలి. ఈ ఎడిషన్‌లో సౌతాఫ్రికా జట్టును చేర్చి ఆఫ్రో-అసియా కప్‌గా నిర్వహిస్తే బాగుండేది. కనీసం భారత్-ఏ జట్టును అయినా అదనంగా బరిలోకి దింపినా రసవత్తర పోరు ఉండేది. బంగ్లాదేశ్ గురించి ఎక్కువగా మాట్లాడలేం. ఆ జట్టులో పెద్దగా ఏమీ లేదు. ఇతర జట్ల సంగతి కూడా సరేసరి. ఇవన్నీ భారత్‌కు ఏ మాత్రం పోటీనివ్వగలవు..?
చాలామంది అనుకున్నట్లుగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కప్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఈ టోర్నీ ఏ మాత్రం కీలకం కాదు. ఇందులో పెద్ద పోటీనే ఉండదు. అఫ్గానిస్థాన్ బౌలింగ్‌ను చూశాక నాకు ఇదే అభిప్రాయం కలిగింది. ఒకవేళ భారత్‌తో మ్యాచ్‌లో 170+ పరుగుల లక్ష్యం ఎదురైతే అఫ్గాన్ ఛేదించగలదా? అసాధ్యం అనుకుంటున్నా. టీమిండియాను ఓడించాలంటే ఏ జట్టుకైనా ఆ రోజు బాగా కలిసిరావాలి. టీ20ల్లో చివరివరకూ థ్రిల్లింగ్‌గా జరుగుతాయి. కానీ, ఆసియా కప్‌లోనూ భారత్ మ్యాచ్‌లు ఏకపక్షమే.'అని అశ్విన్ పేర్కొన్నాడు.