భారత మహిళా స్పిన్నర్, తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీచరణిపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతోనే టీమిండియా విజేతగా నిలిచిందని కొనియాడాడు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
ఈ టోర్నీలో ఆంధ్ర ప్రదేశ్, కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో వికెట్ తీసింది. ఫైనల్‌తో సహా సెమీఫైనల్లో శ్రీ చరణి కట్టడిగా బౌలింగ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచకప్ ఆడిన తొలి క్రికెటర్ గుర్తింపు పొందిన శ్రీచరణి.. పటిష్టమైన ఆస్ట్రేలియాపై లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై ఆమె 5 వికెట్లు పడగొట్టింది. సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ.. భారత జట్టులో శ్రీ చరణి ప్రమాదకరమైన బౌలర్ అని పేర్కొంది. అంటేనే ఆమె ప్రభావం ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఈ విజయంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. శ్రీ చరణిని ప్రత్యేకంగా కొనియాడాడు. భవిష్యత్తులో ఆమె సూపర్ స్టార్ అవుతుందని జోస్యం చెప్పాడు. ఆమె బౌలింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉందని కొనియాడాడు. మహిళల క్రికెట్‌లో గొప్ప స్పిన్నర్లు అయిన సోఫీ ఎక్లెస్టోన్, జెస్ జోనాసెలతో శ్రీచరణిని పోల్చాడు. 'శ్రీ చరణి బంతి తిప్పే విధానం, వేగం అద్భుతం. ఆమె బౌలింగ్ టెక్నిక్ సోఫీ ఎక్లెస్టోన్, జెస్ జోనాసెన్, సోఫీ మోలినెక్స్ వంటి టాప్ స్పిన్నర్ల తరహాలోనే ఉంది. ఆమె వెయిట్ ట్రాన్సఫర్ అమోఘం. బౌలింగ్ చేసే సమయంలో ఆమె శక్తి ఏం వృథా కావడం లేదు. భవిష్యత్తు శ్రీచరణి తప్పకుండా సూపర్ స్టార్ బౌలర్ అవుతుంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
భారత్ సాధించిన అన్ని ప్రపంచకప్‌ల కంటే ఈ విజయం ఎంతో గొప్పదని కొనియాడాడు. ముఖ్యంగా ప్రపంచకప్ టైటిల్‌ను మాజీ క్రికెటర్లు అయిన మిథాలీ రాజ్, జులాన్ గోస్వామికి అందించడాన్ని అశ్విన్ ప్రత్యేకంగా అభినందించాడు. 'భారత మహిళల జట్టు ప్రపంచకప్‌ను తీసుకెళ్లి మిథాలీ రాజ్ చేతిలో పెట్టింది. ఈ విషయంలో నేను హర్మన్ సేనను అభినందిస్తున్నా.
భారత పురుషుల జట్టు ఇలా గతంలో ఎప్పుడూ చేయలేదు. కొన్నిసార్లు మీడియా ముందు మాత్రం ఏదో చెబుతుంటాం. ఆ వ్యక్తి అలా చేశాడు.. ఇలా చేశాడని గొప్పగా చెబుతాం. కానీ మాజీ ఆటగాళ్లకు క్రెడిట్ ఇవ్వడాన్ని నేను అయితే చూడలేదు. మా తరం బాగుంది. మీ తరం టీమ్ అంత గొప్పగా లేదనే చర్చలే ఎక్కువగా జరుగుతుంటాయి.
అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్‌కు టీమిండియా ట్రోఫీ అందించింది. దీంతో వారు కూడా భావోద్వేగానికి, అనందానికి లోనయ్యారు. అలా వారికి ట్రోఫీ ఇవ్వడం బాగుంది. భారత మహిళల జట్టుకు ఈ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది 25 ఏళ్ల శ్రమకు ఫలితం. భారత మహిళల విజయం గతంలో సాధించిన ప్రపంచకప్ విజయాల కంటే గొప్పది. ఎందుకంటే ప్రస్తుతం మహిళల జట్టు విజయంతో ఎంతో మంది బాలికలు.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోనున్నారు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.