రోహిత్ శర్మ చేసింది తప్పే.. ఎల్బీ అయితే అలా వెనక్కి తీసుకుంటారా?: అశ్విన్

న్యూఢిల్లీ: శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మన్కడింగ్ రనౌట్ అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడాన్ని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుబట్టాడు. బౌలింగ్ వేయకముందే నాన్ స్ట్రైకర్ క్రీజు ధాటితే రనౌట్ చేయడం నైతికమని, ఐసీసీ నిబంధనల్లో కూడా చేర్చారని స్పష్టం చేశాడు.
ఇతర ఔట్లలానే దీన్ని కూడా పరిగణించాలన్నాడు. 98 పరుగుల వద్ద ఉన్న డసన్ షనకను మహమ్మద్ షమీ మన్కడింగ్ చేయగా.. రోహిత్ శర్మ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది.

మన్కడింగ్ చట్టబద్దమైనదే..
ఈ నిర్ణయంపై తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. ఇప్పటికీ ఆ రూల్‌ను అనైతికంగా భావించడం సరికాదన్నాడు. మహమ్మద్ షమీని అప్పీల్ వెనక్కు తీసుకోమని రోహిత్ చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డాడు. బ్యాటర్లు, బౌలర్లకు సమాన అవకాశాలు ఉండాలని చెప్పాడు.
ఓ ఎల్బీడబ్ల్యూ, క్యాచ్ ఔట్ విషయంలో కూడా ఇలా తమ అప్పీల్‌ను ఇలా వెనక్కి తీసుకుంటారా? అని ప్రశ్నించాడు. 'క్రికెట్‌లో సాధారణంగా ఫీల్డర్ అప్పీల్ చేస్తే.. అది ఔటైతే ఔటివ్వడం అంపైర్ విధి. కానీ మన్కడింగ్ ఔట్‌పై ఇంకా భిన్నాభిప్రాయాలు ఉండటం ఆశ్చర్యంగా ఉంది.

బ్యాట్స్‌మన్‌ను ఇలానే అడుగుతారా?
అయితే శ్రీలంకతో తొలి వన్డేలో మహమ్మద్ షమీ చేసింది సరైనదే. అతను నిబంధనల మేరకే రనౌట్ చేసి అప్పీల్ చేసాడు. చాలా మ్యాచ్‌ల్లో క్యాచ్ ఔట్ అయినప్పుడు అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. అలాంటి సందర్భాల్లో ఏ బ్యాటింగ్ టీమ్ కెప్టెన్ కూడా.. 'ఔట్ ఇవ్వకముందే ఎందుకు వచ్చావు? మళ్లీ బ్యాటింగ్‌కు వెళ్లు?'అని అడగలేదు. అదే బౌలర్ ఔట్ చేస్తే.. అప్పీల్ వెనక్కి తీసుకోమని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు. బ్యాటర్లకు ఒక న్యాయం, బౌలర్లకు మరో న్యాయమా? చాలా ఏళ్లుగా బౌలర్ల పట్ల ఈ వివక్ష కొనసాగుతోంది'అని అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు.

కెప్టెన్ల జోక్యం ఎందుకు...?
మన్కడింగ్ ఔట్ విషయంలో కెప్టెన్ జోక్యం చేసుకోకూడదని అభిప్రాయపడ్డాడు. క్యాచ్ ఔట్, ఎల్బీ డబ్ల్యూ వికెట్ల విషయంలో ఇలానే జోక్యం చేసుకుంటారా? అని ప్రశ్నించాడు. 'మ్యాచ్‌లోని పరిస్థితి అప్రస్తుతం. ఇక్కడ నేను చెప్పేదొక్కటే.. అలా ఔట్ చేయడం ఇప్పుడు చట్టబద్ధమైందే. ఒకవేళ ఎల్బీ, క్యాచ్ ఔట్ సమయంలో కెప్టెన్ నిర్ణయంతో చెక్ చేస్తారా?. కౌన్ బనేగా కరోడ్‌పతిలో అమితాబ్ బచ్చన్‌లా కెప్టెన్‌తో అంపైర్ 'మీరు అప్పీల్‌కు కట్టుబడి ఉన్నారా' అని అడగరు. బౌలర్ అప్పీలు చేస్తే అది ఔట్ అయితే అంపైర్ దానిని ఔట్‌గా ప్రకటిస్తారు. లేకపోతే లేదు. ఒకవేళ ఫీల్డర్ అప్పీలు చేసినా అంపైర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మన్కడింగ్ నైతికమే..
క్రికెట్‌లో బ్యాటర్లు, బౌలర్లకు సమ అవకాశాలు ఉండాలని కోరుకునే అశ్విన్.. బౌలర్లకు అనుకూలంగా ఉన్న నిబంధనలన్నిటిని ఉపయోగించుకుంటాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో అతను మన్కడింగ్ చేయగా సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ విధానాన్ని ఇప్పటికీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు అనైతికంగా భావిస్తుంటే.. భారత ఆటగాళ్లు మాత్రం నైతికమనేదేనని వాదిస్తున్నారు. మహిళల క్రికెట్‌లో దిప్తీ శర్మ కూడా ఇలా మన్కడింగ్ చేయడం దుమారం రేపింది. ఇంగ్లీష్ మీడియా భారత బౌలర్‌పై దుమ్మెత్తిపోసింది. కానీ క్రికెట్ నిబంధనలను రూపొందించే మెర్లిన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) మన్కడింగ్ నైతికమనే చెబుతూ... రనౌట్ జాబితాలో చేర్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications