తమ్ముడూ.. ఈ గలీజ్ పనులు వద్దూ: అశ్విన్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విలువైన సలహా ఇచ్చాడు. గలీజ్ అలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికాడు. ఓ అన్నలా ఈ విషయం చెబుతున్నానని, బహిరంగంగా ఇలాంటి పనులు చేయవద్దని విజ్ఞప్తి చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఔటైన ప్రస్టేషన్‌లో రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ సిగరెట్ తాగాడు. ఇది టీవీ కెమెరాలకు చిక్కడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. క్రికెట్ గౌరవాన్ని తగ్గించే ఘటనగా పేర్కొంటూ ఈ చర్యలు తీసుకుంది.
క్రికెట్‌ను అగౌరవపర్చే చర్య..
'ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.21ను రియాన్ పరాగ్ ఉల్లంఘించాడు. ఇది క్రికెట్‌ను అగౌరవపర్చే చర్య. అయితే తన తప్పును అంగీకరించిన రియాన్ పరాగ్.. శిక్షకు అంగీకరించాడు.'అని బీసీసీఐ తమ ప్రకటలో పేర్కొంది. అయితే ఇలాంటి చర్యకు అవకాశం కల్పించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్‌పై కూడా బీసీసీఐ చర్యలు తీసుకోనుందని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.
'ఐపీఎల్ గౌరవాన్ని పాటించాల్సిన బాధ్యత ఆటగాళ్లతో పాటు జట్టుది. ఈ నేపథ్యంలో సదరు టీమ్‌పై చర్యలు తీసుకునే అవకాశాలను పరీశీలిస్తున్నాం.'అని సైకియా పేర్కొన్నాడు.

తమ్ముడూ ఇలాంటివి వద్దు..
ఈ ఘటనపై రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు. ఇదో దురదృష్టకర ఘటనగా అభివర్ణించాడు. రియాన్ పరాగ్ అలా చేయాల్సింది కాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు తమ చర్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని అతను సూచించాడు. 'ఇది అన్ని విధాలుగా నివారించి ఉండాల్సిన ఘటన. ఇలాంటి విషయాలకు దూరంగా ఉండాలని యువ ఆటగాళ్లను కోరుతున్నా.
ఇది వ్యక్తిగత ఇష్టాలకు సంబంధించిన విషయమే. కానీ ఇవి వ్యక్తిగతంగానే ఉండాలి. బహిరంగా ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదు. ఒక అన్నలాగా పరాగ్‌కు నేను సలహా ఇస్తున్నా. నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక ఐపీఎల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండి ఇలా చేయడం సరికాదు.
చాలా మంది యువ ఆటగాళ్లు నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. కాబట్టి బాధ్యతతో వ్యవహరించడం అవసరం. ఈ రోజుల్లో ఏ విషయాన్ని దాచలేం. కాబట్టి మున్ముందు తప్పునుంచి నేర్చుకోవాలంటే తగిన శిక్ష వేయడం కూడా అవసరం. పరాగ్ విషయంలో అదే జరిగింది.'రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications