టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పెట్టుకోవద్దని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను మాజీ కోచ్ రవిశాస్త్రి హెచ్చరించాడు. వ్యక్తిగత అజెండాతో వారిని ఇబ్బంది పెట్టడమంటే కొరివితో తల గోక్కోవడమేనని తెలిపాడు. వాళ్లకు చిర్రెత్తుకొస్తే అందరూ దెబ్బతింటారని వార్నింగ్ ఇచ్చాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లోనే ఆడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కానీ మరో రెండేళ్ల వరకు జట్టులో కొనసాగుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో రోహిత్, కోహ్లీకి పడటం లేదనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి మాట్లాడుతూ.. గంభీర్‌ను హెచ్చరించాడు.

'ఆటలో కోహ్లీ, రోహిత్ తాతలు. వైట్‌బాల్ ఫార్మాట్ దిగ్గజాలు. వాళ్లను అనవసరంగా కెలకొద్దు. వాళ్లకు చిర్రెత్తుకొచ్చిందంటే అందరూ దెబ్బతింటారు. అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం. ఒకరు ఛేజింగ్ కింగ్ అయితే.. మరొకరు మూడు వన్డే డబుల్ సెంచరీలు సాధించాడు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శలు గుప్పించాడు. వారి పేర్లను నేరుగా ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. కెరీర్‌లో పెద్దగా సాధించని వ్యక్తులు రోహిత్, కోహ్లీ భవిష్యత్తును నిర్ణయిస్తుండటం దురదృష్టకరమని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
'ఏం సాధించని కొందరు ఆటగాళ్ల కెరీర్‌లను శాసిస్తుంటారు. నా విషయంలోనూ ఇలా జరిగింది. నా సహచరుల్లో చాలా మందికి ఇలా జరిగింది. చాలా దురదృష్టకరం. దీని గురించి ఎప్పుడూ ఎవరం మాట్లాడం. చర్చించం. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రోహిత్ శర్మ కూడా గొప్పగా ఆడుతున్నాడు. వాళ్లిద్దరూ పరుగులు చేస్తున్నారు. కెరీర్‌లో ఏ ఘనతలు అందుకొని వ్యక్తులు రోహిత్, కోహ్లీ భవిష్యత్తును నిర్ణయిస్తుండటం దురదృష్టకరం.'అని హర్భజన్ సింగ్ తెలిపాడు.