
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని టీమ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిశాస్త్రి ముందు దాదాతో ఉన్న మనస్పర్థల గురించి ప్రస్తావించగా.. అలాంటివేమి లేవన్నాడు. అంతేకాకుండా సౌరవ్ గంగూలీ తన సారథ్యంలో ఆడాడని, చాలా కలిసే క్రికెట్ ఆడామని చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్‌లో రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీకి ఏ మాత్రం పడదని ప్రతీ ఒక్కరికి తెలిసిందే.
పైగా అవకాశం దొరికినప్పుడల్లా ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. వార్తల్లో నిలుస్తుంటారు. ఒకరోజు ఆలస్యంగా వచ్చినందుకు జట్టు ప్రయాణం చేసే బస్సులో గంగూలీని రవిశాస్త్రి ఎక్కనివ్వలేదని, అప్పుడే ఈ ఇద్దరి మధ్య వైరం మొదలైందనే ప్రచారం జరిగింది. ఇదే విషయం గురించి దాదాను మీడియా ప్రశ్నించగా "అలాంటిదేమీ లేదు. అయినా మీరు రవిశాస్త్రిని ఉదయాన్నే ఇంటర్వ్యూ చేయొద్దు. సాయంత్రం చేయండి'అని వెటకారంగా బదులిచ్చాడు.
తాజాగా ఈ విషయం గురించి రవి శాస్త్రిని అడగగా.. "గంగూలితో నాకు మనస్పర్థలు లేవు. ఎవరికోసం బస్సు ఆగదు. అది ఎవరైన సరే. ఆ రోజు గంగూలీ ఉన్నాడంతే" అని సమాధానమిచ్చాడు. 'బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా మీకు వ్యతిరేకమా?' అని అడగగా.. "అలాంటిదేం లేదు. అతను ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు తనతో మాట్లాడా. దాదా ఆటను చాలా చూశాను. మేమిద్దరం ఒకే జట్టు(టాటా స్టీల్)కు ఆడాం. ఆ జట్టుకు నేను కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు నా సారథ్యంలో అతను ఆడాడు. చాలా కాలం కలిసే ఉన్నాం'అని శాస్త్రి చెప్పుకొచ్చాడు. మీడియాకు ఇలాంటి స్టోరీస్ (బేల్ పూరి, చాట్ స్టోరీలు) అంటే చాలా ఇష్టమని, దానిమీద చక్కగా మసాలా జల్లుతారని, తాను కూడా ఇలాంటివి ఇష్టపడతానని మీడియాపై శాస్త్రి వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి కోచ్ పదవి గడువు ముగియనుంది. ఆ పదవిలో కొనసాగేందుకు అతను సుముఖంగా లేడు. దాంతో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.