
లండన్: క్రికెట్ పుట్టినింట టీమిండియా ప్లేయర్‌గా.. హెడ్ కోచ్‌గా విజయాన్నందుకోవడం సంతోషంగా ఉందని రవిశాస్త్రి తెలిపాడు. సోమవారం ముగిసిన లార్డ్స్ టెస్ట్‌లో కోహ్లీసేన 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో టెయిలండర్ల అసాధారణ ఆటతో అద్భుతం చేసిన టీమిండియా చిరస్మరణీయ విజయాన్నందుకుంది. క్రికెట్ పుట్టినిల్లు, మక్కాగా పిలిచే లార్డ్స్‌లో భారత్‌కు ఇది మూడో విజయం.
ఈ మైదానంలో ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో తొలి సారి విజయాన్నందుకుంది. అనంతరం 2014లో ధోనీ కెప్టెన్సీలో మరో మ్యాచ్ గెలవగా... ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు ముచ్చటగా మూడో విజయాన్నందుకుంది. 1986 కపిల్ దేవ్ సారథ్యంలో గెలిచిన భారత జట్టులో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజా విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ అతను ట్వీట్ చేశాడు.
ఇదో అద్భుతమైన అనుభూతని, ఈ ఆనందాన్నిచ్చిన ఆటగాళ్లందరికి ధన్యవాదలు తెలిపాడు. ఈ సంతోషకర క్షణాలను జట్టుతో కలిసి ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నాడు. 'క్రికెట్ పుట్టినింట ఆటగాడిగా.. కోచ్‌గా విజయాన్నందుకోవడం ప్రత్యేక అనుభూతినిచ్చింది. ఈ సంతోషాన్నిచ్చిన ఆటగాళ్లందరికి ధన్యవాదాలు. ఈ ఆనందకర క్షణాలను జట్టుతో కలిసి ఆస్వాదిస్తున్నా'అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.
లార్డ్స్ టెస్ట్ విజయానంతరం టీమిండియా ఇచ్చిన ఫోజ్ ఫొటోను ఈ ట్వీట్‌కు జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కోహ్లీసేన విజయాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు.
181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించారు. దాంతో భారత్‌కు 271 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్(96 బంతుల్లో 25), జోరూట్(60 బంతుల్లో 33) పోరాడినా ఫలితం లేకపోయింది. సెంచరీతో రాణించిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో చెలరేగగా.. జస్‌ప్రీత్ బుమ్రా(3/33) మూడు, ఇషాంత్ శర్మ(2/13) రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ(1/13)కి ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో బోణీ కొట్టింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఆగస్టు 25న(బుధవారం) లీడ్స్ వేదికగా జరగనుంది.