
న్యూఢిల్లీ: టీ20 క్రికెట్‌లో సూపర్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ నిబంధనను అమలు చేయాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సూచించాడు. ఈ కొత్త నిబంధన కారణంగా ఆట స్వరూపమే మారిపోతుందన్నాడు. 'లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ)' 2022 సీజన్‌లో ఈ కొత్త నిబంధనను అమలు చేస్తున్నారు. ఈ నిబంధన ప్రకారం తుది జట్టులో లేని ఓ ప్లేయర్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం మరో ప్లేయర్‌కు ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగి బౌలింగ్/బ్యాటింగ్ చేయవచ్చు. అయితే మ్యాచ్‌కు ముందే సూపర్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఎవరో అనే విషయాన్ని ఇరు జట్లు ప్రకటించాల్సి ఉంటుంది.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ శుక్రవారమే ప్రారంభమైంది. ఇందులో భాగంగా 'ఇండియా మహారాజాస్', 'టీమ్ వరల్డ్ జెయింట్స్' జట్ల మధ్య నిర్వహించిన స్పెషల్ బెనిఫిట్ మ్యాచ్‌లోనే 'సూపర్ సబిస్టిట్యూట్' నిబంధనను తీసుకొచ్చారు. ఇన్నింగ్స్‌లో 10వ ఓవర్ అనంతరం ఇరు జట్లు సూపర్ సబిస్టిట్యూట్ ప్లేయర్‌ను బరిలోకి దించారు. ఇండియా మహరాజస్ తరఫున అశోక్ దిండా సూపర్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బరిలోకి దిగాడు.
ఎల్‌ఎల్‌సీ మ్యాచ్ కమిషనర్‌గా ఉన్న రవిశాస్త్రి ఈ నిబంధన గురించి మాట్లాడుతూ.. ఇది గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. 'ఆట.. ప్రతి ఏడాది అభివృద్ధి చెందడం నేను చూస్తున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా భవిష్యత్‌లో ఈ నియమాన్ని ఉపయోగించవచ్చు. ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందగల ఒక ఫార్మాట్. ఇలాంటి టోర్నమెంట్లలో లేదా ఐపీఎల్, బిగ్‌బాష్‌లో మన సొంత నియమాలు రూపొందించుకోవచ్చు. మీరు ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనుకుంటే ఈ నిబంధనను ప్రయత్నించొచ్చు' అని రవిశాస్త్రి అన్నాడు. ఎల్‌ఎల్‌సీలో గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ ఆడుతున్నాయి. 6 వేదికల్లో 16 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరోవైపు బీసీసీఐ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే సీజన్‌లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను మనం చూడొచ్చు. ఈ రూల్ ప్రకారం తుది జట్టులో లేని ఓ ఆటగాడిని మ్యాచ్ జరగుతుండగా 14 ఓవర్ల లోపు మరో ఆటగాడికి రిప్లేస్‌మెంట్‌గా ఆడించవచ్చు. ఇలా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేయవచ్చు. అయితే రిప్లేస్ మెంట్‌గా జట్టును వీడిన ఆటగాడు మాత్రం మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగే అవకాశం లేదు. కనీసం సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ చేసేందుకు కూడా అతను అనర్హుడు.
మ్యాచ్ జరుగుతుండగా.. ఫోర్త్ అంపైర్ లేదా.. ఫీల్డ్ అంపైర్‌కు సమాచారమిచ్చి ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దింపాలి. ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ మ్యాచ్‌ల్లో ఇప్పటికే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అమలు చేస్తున్నారు. ఈ కొత్త రూల్ కారణంగా మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండనుంది. ముఖ్యంగా ఏ ఆటగాడైన తీవ్రంగా గాయపడి ఆడే లేని పరిస్థితులో ఉన్నప్పుడు ఆ జట్టుకు బాగా ఉపయోగపడనుంది.