టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవితవ్యం ఆస్ట్రేలియా పర్యటనతో తేలనుందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో పాటు ఫామ్, ఫిట్‌నెస్ కొనసాగిస్తే వన్డే ప్రపంచకప్ 2027 వరకు కొనసాగుతారని తెలిపాడు.
టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే తమ లక్ష్యమని ఈ ఇద్దరూ ఆటగాళ్లు తెలిపారు. అందుకు సన్నదం కూడా అవుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ అనంతరం పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రి.. రోహిత్, కోహ్లీ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్నందుకే రోహిత్, కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యారు. అయితే ఫామ్, ఫిట్‌నెస్‌పైనే వారి ప్రపంచకప్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఫామ్ కొనసాగిస్తూ ఫిట్‌గా ఉంటేనే రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచకప్‌లో చోటు దక్కుతుంది.
వారి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే దిశగా ఆస్ట్రేలియాతో సిరీస్ వారిద్దరికీ కీలకం. ఈ సిరీస్‌తో వారికి వారే తమ కెరీర్‌పై ఓ నిర్ణయానికి రావొచ్చు. కుర్రాళ్ల నుంచి పోటీ పెరుగుతుందని ఈ ఇద్దరికీ తెలుసు. జట్టు ప్రణాళికల్లో ఉండాలంటే ఏం చేయాలో వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
తొలి వన్డే: అక్టోబర్ 19(ఆదివారం),పెర్త్, ఉదయం 9 గంటలకు
రెండో వన్డే: అక్టోబర్ 23(గురువారం), అడిలైడ్, ఉదయం 9 గంటలకు
మూడో వన్డే: అక్టోబర్ 25(శనివారం), సిడ్నీ , ఉదయం 9 గంటలకు