ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ సెమీస్ చేరితే మరింత ప్రమాదకరంగా మారుతుందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. పాకిస్థాన్‌ను ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దని సూచించాడు. ఫిబ్రవరి 19 నుంచి ఈ మినీ వన్డే ప్రపంచకప్‌కు తెరలేవనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. భారత్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాక్ దాయాదుల పోరు ఫిబ్రవరి 23న జరగనుంది.
డేంజరస్‌గా పాకిస్థాన్..
తాజాగా ఈ టోర్నీ గురించి ఐసీసీ రివ్యూలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి మాట్లాడిన రవి శాస్త్రి.. పాకిస్థాన్ జట్టు పటిష్టంగా ఉందని అభిప్రాయపడ్డాడు. 'యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ పాకిస్థాన్ జట్టుకు దూరమయ్యాడు. అతను క్వాలిటీ ప్లేయర్. అయినప్పటికీ.. పాకిస్థాన్ ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దు. పాకిస్థాన్ జట్టుకు లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అంతేకాకుండా గత కొద్ది నెలలుగా పాకిస్థాన్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. సౌతాఫ్రికా గడ్డపై మెరుగైన ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై ఆ జట్టును ఓడించడం చాలా కష్టం. ఏ జట్టు అయినా సరే తమ దేశంలో ప్రమాదకరంగానే ఉంటాయి. ఒకవేళ పాకిస్థాన్ సెమీస్ చేరితే మాత్రం ఆ జట్టు మరింత ప్రమాదకరంగా మారుతుంది.'అని రవిశాస్త్రి హెచ్చరించాడు.

రికీ పాంటింగ్ సైతం..
రవి శాస్త్రి వ్యాఖ్యలతో రికీ పాంటింగ్ కూడా ఏకీ భవించాడు. పాకిస్థాన్‌ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని సూచించాడు. 'రవి శాస్త్రి కామెంట్స్‌తో నేను ఏకీభవిస్తున్నాను. సయీబ్ ఆయుబ్ లేని లోటు పాకిస్థాన్ జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సంచలనాలు చేయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. పాక్ పేస్ బౌలింగ్‌ను పరిశీలిస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా అత్యంత ప్రమాదకరంగా మారారు.
ఇటీవల జరిగిన సిరీస్‌ల్లో వారు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఎంతటి బ్యాటింగ్ లైనప్‌నైనా కట్టడి చేయగలరు. బ్యాటింగ్ విషయానికొస్తే.. బాబర్ ఆజామ్, రిజ్వాన్ కీలకం కానున్నారు. ఈ ఇద్దరూ చెలరేగితే పాకిస్థాన్‌కు తిరుగుండదు. సొంతగడ్డపై ఆడుతుండటం పాక్‌కు కలిసొచ్చే అంశం. సొంత అభిమానుల మద్దతు ఉంటుంది. అయితే ఒత్తిడి కూడా ఉంటుంది. తమదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా ఓడించే సత్తా పాకిస్థాన్‌కు ఉంది.'అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.