
న్యూఢిల్లీ: భారత్‌లోని క్రికెట్ అభిమానులకు మతిమరుపు ఎక్కువని, విజయాలు ఎవ్వడికి గుర్తుండవని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. ఓటములు ఎదురైనప్పుడు మాత్రం నోరుపారేసుకుంటారని తెలిపాడు. తాను కోచ్‌గా ఉన్నప్పుడు టీమిండియా రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచిందని, ఈ విజయాలు ఎవ్వడికి గుర్తులేవన్నాడు. ఐసీసీ టైటిల్ గెలవలేదని తనపై విమర్శలు గుప్పించారని చెప్పాడు. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్‌ను కూడా అలానే విమర్శిస్తున్నారని, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ గెలవలేదని మాట్లాడుతున్నారని రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు.
మెగా టోర్నీలు గెలవాలంటే కాస్త ఓపిక అవసరమని, రాహుల్ ద్రవిడ్‌కు తగిన సమయం ఇవ్వాలని ఫ్యాన్స్‌ను కోరాడు. స్పోర్ట్స్ తక్ చానెల్‌తో మాట్లాడిన రవి శాస్త్రి కోచ్‌గా టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందించే సత్తా రాహుల్ ద్రవిడ్‌కు ఉందని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. 'కొన్ని విషయాల్లో ఓపికగా ఉండటం అవసరం. ముఖ్యంగా మెగా టోర్నీల్లో ఆడిన ప్రతీసారి టైటిల్ గెలవాలంటే కుదరదు. రాహుల్ ద్రవిడ్‌కు కూడా కాస్త సమయం పడుతుంది. ఐసీసీ టైటిల్ గెలిచే కోచ్‌గా రాహుల్‌కే ఎక్కువ అవకాశం ఉంది. అతను ఎన్‌సీఏ హెడ్‌గా పనిచేశాడు. భారత్-ఏ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.
ఇప్పుడు టీమిండియా హెడ్‌గా సేవలందిస్తున్నాడు. క్రికెటర్లను ఎలా డీల్ చేయాలో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు బాగా తెలుసు. భారత అభిమానులకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ. మెగా టోర్నీల్లో టీమిండియా ఆడేటప్పుడు ఎలాగైనా జట్టు గెలవాలనుకుంటారు. నేను కోచ్‌గా ఉన్నప్పుడు టీమిండియా (2016, 2018) రెండు సార్లు ఆసియాకప్ గెలిచింది. కానీ ఈ విషయాన్ని జనాలు మరిచిపోయారు. ఈ విజయాల గురించి మాట్లాడేవారే లేరు. కానీ గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా ఓడితే మాత్రం అందరూ ఆ టోర్నీ గురించి మాట్లాడారు. ఇలా ఎందుకు జరుగుతుంది. అందుకే ఆటగాళ్లు ప్రతీసారి విజయం కోసం తమ ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడే అభిమానులు ఆశించిన విజయాలు సాధ్యమవుతాయి.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టైటిల్ గెలవలేదని హెడ్ కోచ్ రవి శాస్త్రి, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీలను తప్పించిన బీసీసీఐ.. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లకు వారి బాధ్యతలను అప్పగించింది. కానీ ఈ ఇద్దరి పర్యవేక్షణలోని టీమిండియా ఆసియాకప్ కూడా గెలవలేకపోయింది. టీ20 ప్రపంచకప్‌లోనూ సెమీఫైనల్లోనూ వెనుదిరిగింది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌తో పాటు వచ్చే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ రెండింటికీ మధ్య సెప్టెంబర్‌లో మరోసారి ఆసియా కప్ ఆడనుంది.