
బ్యాండ్ బజాయించి వచ్చాం..
'మీ లైఫ్ టైమ్‌లోనే ఎప్పుడూ ఇలాంటి పరిస్థితుల్ని చూసే అవకాశం దక్కదు. ఆస్ట్రేలియాను సొంత గడ్డపై వరుసగా రెండుసార్లు ఓడించడం ఎంతో ప్రత్యేకం. తొలిసారి మేం విజయం సాధించినప్పుడు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకుండా గెలిచామని చాలా మంది అన్నారు. ఇప్పుడు వాళ్లుండగానే యువ ఆటగాళ్లతో సత్తా చాటి విజయం సాధించాం. వారి బ్యాండ్ బజాయించి వచ్చాం. ఈ సిరీస్‌లో మా ఆటగాళ్లు ప్రదర్శించిన నిబద్ధత చాలా కాలం గుర్తుండిపోతుంది' అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

కార్తీక్ త్యాగి మినహా..
'క్రికెట్‌లో ఇంతకుముందెప్పుడూ ఇలా జరిగి ఉండదు. 36 పరుగులకే ఆలౌటయ్యాక అనూహ్య రీతిలో టీమిండియా పుంజుకుంది. ఇది నమ్మశక్యం కానిది. చివరి టెస్టులో ఇక ఆడకుండా ఉన్నది ఒకే ఒక్క ఆటగాడు. అది కూడా కార్తీక్ త్యాగి. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఎవరైనా కంకషన్‌కు గురైతే అతను కూడా మైదానంలో అడుగుపెట్టేవాడు. దీని గురించి ఆలోచిస్తేనే గూస్‌బంప్స్ వస్తాయి' అనిఈ టీమిండియా హెడ్ కోచ్ అభిప్రాయపడ్డాడు. కాగా, కీలక ఆటగాళ్లు లేకున్నా టీమిండియా బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆసీస్ కంచుకోట అయిన గబ్బాలో గెలుపొందడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ చిరస్మరణీయ విజయం.

బ్రేక్ అవసరం..
కరోనా నేపథ్యంలో బయో బబుల్, క్వారంటైన్‌ల వల్ల ఆటగాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడి గురువుతున్నారని, వారికి తగిన విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్ ముగియగానే ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండానే టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అది ముగియగానే తక్కువ వ్యవధిలోనే ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్ ప్రారంభించింది. ఇది పూర్తవ్వగానే మళ్లీ ఐపీఎల్ 14వ సీజన్ కోసం సన్నద్ధమవుతుంది. ఇలా వరుసగా ప్రతిసారి ఆట కోసం ప్లేయర్లంతా బయోబబుల్, క్వారంటైన్లో ఉంటున్నారు . ఈ నేపథ్యంలోనే.. ఆటగాళ్లకు ఐపీఎల్ 2021 తర్వాత రెండు వారాల పాటు విశ్రాంతి తప్పనిసరిగా అవసరమని రవిశాస్త్రి సూచించాడు. అప్పుడే వారు మరింత ఉత్సాహంగా ఆడగలరని చెప్పాడు.

ఆటగాళ్లు మనష్యులే..
'అంతర్జాతీయ క్రికెట్‌లో భారత ఆటగాళ్లకు కొంత విరామం ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత వారు ఐపీఎల్ 14వ సీజన్ ఆడతారు. దీని కోసం వారు క్వారంటైన్, బయోబుడగలో ఉంటారు. అంతకుముందు ఐపీఎల్ 13, ఆస్ట్రేలియా సిరీస్ కూడా విరామం తీసుకోకుండానే ఆడారు. దీని వల్ల వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. వాళ్లు కూడా మనుషులే. కాబట్టి వారికి విశ్రాంతి కల్పించండి." అని శాస్త్రీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ పూర్తవ్వగానే టీమిండియా.. ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్‌లతో పాటు కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది.


Click it and Unblock the Notifications












