
న్యూఢిల్లీ: 'ధోనీ ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఏ మేగ్నిఫిషెంట్ స్ట్రైక్ ఇన్‌టూ ది క్రౌడ్! ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్ (ధోనీ తనదైన శైలిలో ముగించాడు. అద్భుతమైన షాట్‌తో బంతిని జనాల్లోకి పంపాడు. 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్ అందుకుంది)'అని గంభీరమైన గొంతుతో వ్యాఖ్యాతగా రవిశాస్త్రి చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. టీమిండియా ప్రపంచకప్‌ను అందుకోవడం క్రికెట్ అభిమానులందరికీ ఎంతలా గుర్తుంటుందో.. ధోనీ చివరి సిక్స్ కొట్టినప్పుడు కామెంటేటర్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కామెంట్రీ కూడా అంతే గుర్తుండిపోయింది.
రవిశాస్త్రి కామెంట్రీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. గంభీరమైన గొంతుతో తనదైన చలోక్తులతో ఆకట్టుకునే విధంగా అతని వ్యాఖ్యానం సాగేది. అయితే రవిశాస్త్రి.. టీమిండియా డైరెక్టర్‌గా, హెడ్ కోచ్‌గా మారిన తర్వాత అభిమానులు అతని వ్యాఖ్యానాన్ని చాలా కాలంగా మిస్సయ్యారు. 2014లో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి తర్వాత హెడ్ కోచ్ అయ్యారు. 2016లో పదవి కోల్పోయినా.. 2017లో మళ్లీ ఆ బాధ్యతలను స్వీకరించాడు. దాంతో గత ఏడేళ్ల పాటు అతను కామెంట్రీకి దూరమయ్యాడు. అయితే టీ20 ప్రపంచకప్‌తో హెడ్ కోచ్‌గా అతని పదవి కాలం ముగియడంతో మళ్లీ వ్యాఖ్యానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్ని అనుకున్నట్లు జరిగితే భారత్-ఇంగ్లండ్ మధ్య కరోనా కారణంగా వాయిదా పడిన ఆఖరి టెస్ట్‌కు రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌ను వచ్చే ఏడాది నిర్వహించేందుకు ఇరు బోర్డులు కలిసి షెడ్యూల్ ఖరారు చేశాయి. ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యానం చేసేందుకు శాస్త్రి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై టీమిండియా ఘన విజయం సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి మీడియాతో మాట్లాడాడు. 'టీమిండియా కోచ్‌గా అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించాను. టీమిండియా విదేశాల్లో ఎన్నో విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాను సొంత గడ్డపైనే ఓడించింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వాయిదా పడిన ఐదో టెస్టు గురించి మాట్లాడుతూ.. 'ఆ టెస్టుకు నేనే కామెంటేటర్‌గా వ్యవహరిస్తానేమో' అని శాస్త్రి అన్నాడు. మరోవైపు, వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లోకి కొత్తగా వచ్చిన అహ్మదాబాద్ జట్టుకు రవిశాస్త్రి కోచ్‌గా వ్యవహరించే అవకాశమున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.