Ravi Shastri: విరాట్ కోహ్లీ వర్షన్ విన్నాం.. ఇక గంగూలీనే ఈ గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టాలి!

న్యూఢిల్లీ: వన్డే కెప్టెన్సీ మార్పుతో భారత క్రికెట్‌లో రాజుకున్న వివాదంపై తన అభిప్రాయాన్ని చెప్పేందుకు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి నిరాకరించాడు. ఈ వివాదం గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడటం సరికాదన్నాడు. అయితే కెప్టెన్సీ మార్పును ఇంకాస్త బెటర్‌గా హ్యాండిల్ చేయాల్సిందన్నాడు. ఈ వివాదంలో విరాట్ కోహ్లీ తన వర్షన్ చెప్పాడని, మరో ఎండ్‌లో ఉన్న బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీనే తన వాదనేంటో చెప్పాలన్నాడు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ అడ్డా కార్యక్రమంలో మాట్లాడిన రవి శాస్త్రి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

మెరుగ్గా హ్యాండిల్ చేయాల్సింది..
'ఈ సిస్టమ్‌లో నేను కొన్నేళ్లుగా భాగస్వామిగా ఉన్నా. ఈ జట్టుతో గత ఏడేళ్లుగా ప్రయాణం చేశా. మంచి కమ్యూనికేషన్‌తో కెప్టెన్సీ మార్పు వ్యవహారాన్ని ఇంకాస్త మెరుగ్గా హ్యాండిల్ చేయాల్సింది. కానీ వివాదం చెలరేగింది. ప్రజల్లోకి వచ్చింది. విరాట్ కోహ్లీ తన వాదనేంటో చెప్పాడు. ఇక బోర్డు ప్రెసిడెంట్ గంగూలీనే అతని వర్షన్ చెప్పాలి. అసలేం జరిగిందో స్పష్టతనిస్తూ ఈ వివాదానికి ముగింపు పలకాలి. అయితే ఇక్కడ గంగూలీ, విరాట్ కోహ్లీలో ఎవరూ అబద్దాలు చెప్పారనేది కాదు నిజమేంటో తెలియాలి. అది కమ్యూనికేషన్ ద్వారానే వస్తుంది. ఓ వ్యక్తి ఒకవైపు.. అవతలి వ్యక్తి మరోవైపు కూర్చొని మాట్లాడితే క్లారిటీ ఉండదు. ఇద్దరూ కలిసి చెబితేనే వాస్తవం ఏంటో తెలుస్తుంది.

ఏం తెలియకుండా..
అసలేం జరిగిందో తెలియకుండా ఈ వివాదంపై మాట్లాడటం ఏ మాత్రం సరికాదు. భారత క్రికెట్‌లో వరుసగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ మనకు తెలుసు. కానీ అసలు ఏం జరిగింది.. ఏ సందర్భంలో వారు అలా అన్నారు. ఏ ప్రశ్నలకు ఏం చెప్పారు. ఇవన్నీ తెలియల్సిన విషయాలు. ఇవన్నీ తెలియకుండా ఆ గొడవ గురించి మాట్లాడటం మంచిది కాదని నేను భావిస్తున్నా. ఇవన్నీ తెలిస్తే ఎవరు కరెక్ట్.. మరెవరూ తప్పనే విషయాన్ని చెప్పవచ్చు.

కోహ్లీలాంటి కెప్టెన్‌ను చూడలేదు..
విరాట్ కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకున్నాడు. కానీ బీసీసీఐ, సెలెక్టర్లు మాత్రం వైట్ బాల్ క్రికెట్‌లో ఒక్కడే కెప్టెన్ ఉండాలనుకున్నారు. దాంతోనే టీ20 సారథిగా ఉన్న రోహిత్ శర్మకే వన్డే సారథ్య బాధ్యతలు దక్కాయి. టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని కొనసాగించాలి. అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని చెబుతాయి. అతను టెస్ట్ క్రికెట్ అంబాసిడర్. అతని సాధించిన ఫలితాలు చూస్తే.. మరే భారత కెప్టెన్ కూడా దరిదాపుల్లో లేడు. ఈ తరంలో విరాట్ కోహ్లీలా టెస్ట్ క్రికెట్ అంటే పిచ్చితో ఉండే కెప్టెన్ నేను చూడలేదు. గత ఐదేళ్లుగా భారత జట్టు టాప్‌లోనే కొనసాగుతుందంటే దానికి కారణం విరాట్ కోహ్లీనే.

కోహ్లీ X గంగూలీ..
టీ20 కెప్టెన్సీ వదులు కోవద్దని తాను కోహ్లీని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశానని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెప్పగా.. అలాంటిదేమి జరగలేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీ20 కెప్టెన్సీపై పునరాలోచన చేయాలని తనను ఎవరూ కోరలేదని సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో విరాట్ కోహ్లీ కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా వన్డే కెప్టెన్సీ మార్పుపై కూడా తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నాడు. టెస్ట్ జట్టు ఎంపిక పూర్తయిన అనంతరం చవర్లో వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని చెప్పారని, దానికి తాను సరేనన్నాని కోహ్లీ తెలిపాడు. కోహ్లీ వ్యాఖ్యలతో గంగూలీతో సహా బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications