టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడం మంచి పరిణామమని మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవి శాస్త్రి అన్నాడు. అతని పర్యవేక్షణలో టీమిండియా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే ఆటగాళ్లను సమన్వయ పరచడమే హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ముందున్న అతిపెద్ద టాస్క్ అని రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
'గౌతమ్ గంభీర్ జట్టులోని చాలా మందికి సమకాలికుడు. ఐపీఎల్‌లో మెంటార్‌గా సక్సెస్ సాధించాడు. యువకుడు కాబట్టి సరికొత్త ఆలోచనలతో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లతో గంభీర్‌కు పరిచయాలున్నాయి. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఐపీఎల్ ఆడుతున్నవారే.

గంభీర్ కోచింగ్ చాలా సూటిగా ఉంటుంది. అతనికి సొంత ఆలోచనలు ఉంటాయి. అతనికి మెచ్యూర్ టీమ్ దొరకడం కలిసొచ్చే అంశం. పరిపక్వత కలిగిన టీమ్ ఉంటేనే వ్యూహాలు ఫలిస్తాయి. అయితే కోచ్‌గా ఆటగాళ్లను సమన్వయపరచడం చాలా కీలకం. ఈ విషయంలో గంభీర్ ఎలా వ్యవహరిస్తాడనేది ఆసక్తికరం. ఆటగాళ్ల బలాలు, బలహీనతలు, వ్యక్తిత్వాలు అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే గంభీర్ ఎదుట ఉన్న ముఖ్యమైన పనిగా నేను భావిస్తాను.
ఈ పని అతనికి పెద్ద కష్టం కాకపోవచ్చు. జట్టులోని ఆటగాళ్ల గురించి గంభీర్‌కు బాగా తెలుసు. కొందరితో కలిసి పని చేశాడు కూడా. 'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2021 వరకు రవి శాస్త్రి టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నీతో రవి శాస్త్రితో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కెరీర్‌కు కూడా ముగింపు పడింది. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో అతని పదవి కాలం ముగిసింది. దాంతో గంభీర్‌ను కొత్త కోచ్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. శ్రీలంక పర్యటనతో అతను తన బాధ్యతలు చేపట్టనున్నాడు. జూలై 27న భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య తొలి టీ20 జరగనుంది.