
అహ్మదాబాద్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పరీక్షగా మారిందని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. కెప్టెన్‌గా మరిన్ని విషయాలు నేర్చుకోవాడినికి రోహిత్ శర్మకు ఇదొక సదావకాశమని తెలిపాడు. ఇక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తొలి మూడు టెస్టులు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. అయితే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టుకు ఫ్లాట్ పిచ్ సిద్దం చేయగా.. ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.
ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలు నమోదు చేయడంతో వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను మారుస్తూ వికెట్లు తీసినా.. ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు సాధించడంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. అయితే, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో జట్టును నడిపించడం సవాల్‌తో కూడుకున్నదేనని రవిశాస్త్రి తెలిపాడు.
'నాలుగో టెస్టు మ్యాచ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నేర్చుకోవడానికి మంచి అవకాశం. టెస్టులు త్వరగా ముగుస్తున్న పరిస్థితుల్లో.. అహ్మదాబాద్ పిచ్ మంచిదే. వికెట్లు వెంట వెంటనే పడటం లేదు. ఇలాంటప్పుడే జట్టు వనరులను సరైన పద్ధతిలో వినియోగించుకోవాల్సి ఉంటుంది. మంచి వికెట్ మీద విదేశాల్లోనూ, స్వదేశంలోనూ సారథ్యం వహించడం సవాల్‌తో కూడుకున్నదే. రోహిత్ శర్మలో అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలు ఉన్నాయి. కానీ, వాటిని అవసరమైన సందర్భంలో వాడటం ముఖ్యం. టెస్టులో ఏదైనా మంచి భాగస్వామ్యం నమోదు అవుతున్నప్పుడు.. విడగొట్టడానికి తగిన ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌తో ఈ విషయంలో రోహిత్ శర్మ మరింత రాటుదేలుతాడు'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ సెంచరీలతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు చెరొక వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (17 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్ (18 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా 444 పరుగులను భారత్ వెనుకబడి ఉంది.