
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడకుండా ఉండాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సూచించాడు. ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని భారత కీలక ఆటగాళ్ల మ్యాచ్‌ల భారాన్ని తగ్గించేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో బీసీసీఐ, ఆటగాళ్లు మాట్లాడాలని తెలిపాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుండగా.. టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది.
రోడ్డు ప్రమాదంతో రిషభ్ పంత్ జట్టుకు దూరం కాగా.. వెన్నుగాయాలతో జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ బాధపడుతున్నారు. ఈ ఇద్దరు కూడా వన్డే ప్రపంచకప్ ఆడే సూచనలు కనిపించడం లేదు.
మరో 7 రోజుల్లో ఐపీఎల్ 2023 సీజన్‌కు తెరలేవనుంది. ఈ ధనాధన్ లీగ్‌లో స్టార్ ఆటగాళ్లంతా తమ ఫిట్‌నెస్ కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే రవి శాస్త్రి ఆటగాళ్లతో పాటు బీసీసీఐకి కీలక సూచనలు చేశాడు. 'కీలక ఆటగాళ్లు గాయాల బారినపడుతుండటం ఆందోళన కలిగించే విషయం. మేం క్రికెట్ ఆడే సమయంలో ఇన్ని సదుపాయాలు లేవు. అయినా, 8-10 ఏళ్లు సులభంగా ఆడటం మీరంతా చూశారు. మా తరంలో చాలా మంది ఏడాదిలో 8-10 నెలల పాటు ఆడేవారు.
ఇప్పుడు అప్పటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌ల్లో ఆటగాళ్లు భాగం కావడంతో వారికి తగిన విశ్రాంతి సమయం దొరకడం లేదు. ఈ విషయంపై బీసీసీఐ, ఆటగాళ్లు కూర్చొని చర్చించుకోవాలి. ఆటగాళ్లు క్రికెట్ చాలా అవసరం. అదే సమయంలో విశ్రాంతి కూడా వారికి ముఖ్యమే.
అవసరమైతే భారత ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలి. బీసీసీఐ కూడా జోక్యం చేసుకొని 'ఈ ఆటగాళ్లు టీమిండియాకు ముఖ్యం. వారి సేవలు జట్టుకు చాలా అవసరం. వారు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడకపోతే బాగుంటుంది' అని ఫ్రాంచైజీలతో చెప్పాలి'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వర్క్‌లోడ్‌లో భాగంగా ఏ ఆటగాడు కూడా ఐపీఎల్‌కు దూరం కాకపోవచ్చన్నాడు. అయితే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు టీమ్ మేనేజ్‌మెంట్ సంకేతాలిచ్చిందని రోహిత్ పేర్కొన్నాడు. 'ఇక ఇప్పుడంతా ఫ్రాంఛైజీల చేతుల్లోనే ఉంది.
ఆటగాళ్లు ఫ్రాంఛైజీల సొంతం కాబట్టి మేం కొన్ని సంకేతాలిచ్చాం. చివరికి నిర్ణయాలు తీసుకోవాల్సింది మాత్రం ఫ్రాంఛైజీలే. ముఖ్యంగా ఆటగాళ్లు తమ శరీరాలను తామే జాగ్రత్తగా చూసుకోవాలి.'' అని చెప్పాడు.