
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అత్యుత్తమ జట్టే విజేతగా నిలిచిందని టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి అన్నాడు. బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకునే సువర్ణవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. అయితే ఈ విజయానికి న్యూజిలాండ్ ఆటగాళ్లు అర్హులని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. గొప్ప విజయాలు అంత తేలిగ్గా రావనడానికి ఈ మ్యాచే నిదర్శనమని చెప్పాడు.
'ప్రతికూల పరిస్థితుల్లో ఉత్తమ జట్టే విజేతగా నిలిచింది. ఐసీసీ ట్రోఫీ కోసం ఎంతోకాలం వేచిచూసిన న్యూజిలాండ్ ఈ విజయం సాధించడానికి అర్హమైనదే. గొప్ప విజయాలు అంత తేలిగ్గా రావనడానికి ఈ మ్యాచే నిదర్శనం. విలియమ్సన్ టీమ్ బాగా ఆడింది. అందుకు గౌరవిస్తున్నా' అని శాస్త్రి ట్వీట్ చేశాడు. అయితే 2000లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలిచిన న్యూజిలాండ్ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచింది.
2015, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరినా తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ముఖ్యంగా 2019 ఫైనల్లో బౌండరీ కౌంట్ అనే అసంబద్దమైన నిబంధనతో విశ్వకిరిటాన్ని అందుకోలేకపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు 241 పరుగులు చేసి సమానంగా నిలిచాయి. సూపర్ ఓవర్‌లోనూ మళ్లీ 15 పరుగుల సమాన స్కోర్లు సాధించారు. అయితే, ఆ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టినకారణంగా ఇంగ్లండ్ జట్టును విజేతగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ ఇప్పుడు ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకోవడం విశేషంగా మారింది.
ఓవర్‌నైట్ స్కోరు 64/2తో రిజర్వ్ డే అయిన బుధవారం ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (88 బంతుల్లో 4 ఫోర్లతో 41) టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో దెబ్బ తీశాడు. అనంతరం మిగిలిన 53 కనీస ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89 బంతుల్లో 8 ఫోర్లతో 52 నాటౌట్), రాస్ టేలర్ (100 బంతుల్లో 6 ఫోర్లతో 47 నాటౌట్) మూడో వికెట్‌కు 96 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన జేమీసన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.