టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ రూ.100 కోట్ల పైనే సంపాదిస్తారని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. కేవలం ప్రకటనల ద్వారానే వారు ఈ ఆదాయాన్ని ఆర్జిస్తారని తెలిపాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ నేపథ్యంలో ఆ జట్టు మాజీ క్రికెటర్లతో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో రవి శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత సూపర్ స్టార్ క్రికెటర్లు ఎంత సంపాదిస్తారు? అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రవి శాస్త్రి ఈ విషయాన్ని చెప్పాడు.
'భారత సూపర్ స్టార్స్ చాలా సంపాదిస్తారు. చాలా వరకూ వాణిజ్య ప్రకటనల ఒప్పందాల ద్వారానే ఆర్జిస్తారు. వారి ఆదాయం కచ్చితంగా పది మిలియన్ల పౌండ్ల పైనే ఉంటుందని చెప్పగలను. రూపాయాల్లో చెప్పాలంటే రూ. 100 కోట్ల పైనే సంపాదన ఉంటుంది. సచిన్, ధోనీ, విరాట్ వంటి ఆటగాళ్లు తమ కెరీర్ సమయంలోనూ కనీసం 15-20 ప్రకటనల్లో కనిపించేవారు. ఇప్పటికీ వారు ప్రకటనల్లో నటిస్తూ సంపాదిస్తూనే ఉన్నారు.'అని రవిశాస్త్రి తెలిపాడు. ఈ సమాధానంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్(15,921) రికార్డ్‌ను అధిగమించే సత్తా జోరూట్(13270)కు ఉందని రవి శాస్త్రి తెలిపాడు. 'జోరూట్ వయసును అతను ఆడిన టెస్ట్‌లను చూస్తే సచిన్‌ను అధిగమించడం సులువే. అతను మరో నాలుగేళ్లు ఆడే అవకాశం ఉంది. సచిన్‌తో పోలిస్తే అతను ఇంకా 47 టెస్ట్‌లు వెనకే ఉన్నాడు. మరో 3 వేల పరుగులు చేస్తే సచిన్ రికార్డ్ బ్రేక్ అవుతుంది.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.