ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ నుంచి టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పించడంపై మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. విశ్రాంతి తీసుకునే ఆప్షన్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఇవ్వద్దన్నాడు. బుమ్రా విశ్రాంతిని కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయించాలని సూచించాడు. తొలి టెస్ట్ అనంతరం వారం రోజుల విశ్రాంతి లభించిన తర్వాత కూడా మళ్లీ రెస్ట్ ఎందుకు? అని ప్రశ్నించాడు.
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించగా.. ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌పై వేటు పడింది. వీరికి బదులు వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ బరిలోకి దిగారు. వర్క్‌లోడ్ నేపథ్యంలో ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లే ఆడుతానని బుమ్రా ముందే చెప్పాడు. దాంతోనే అతనికి రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించారు. మూడో టెస్ట్ జరిగే లార్డ్స్ మైదానం పరిస్థితులు బుమ్రా బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, దాంతో అతనికి రెస్ట్ ఇచ్చామని టాస్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

అయితే టీమిండియా నిర్ణయాన్ని రవి శాస్త్రి తప్పుబట్టాడు. సాయి సుదర్శన్‌ను తప్పించడంతో పాటు కుల్దీప్ యాదవ్ ఆడించకపోవడంపై కూడా అసహనం వ్యక్తం చేశాడు. 'టీమిండియాకు ఇది చాలా కీలకమైన మ్యాచ్. తొలి టెస్ట్ అనంతరం వారం రోజుల విశ్రాంతి లభించింది. రెస్ట్ తీసుకునే నిర్ణయాన్ని బుమ్రా చేతుల్లోంచి తీసుకోవాలి. తుది జట్టులో ఎవరు ఉండాలనేది కెప్టెన్, కోచ్ నిర్ణయించాలి. ఈ సిరీస్ పరంగా ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బుమ్రా బరిలోకి దిగాల్సింది. లార్డ్స్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడటం టీమిండియాకు కీలకం. తొలి టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా ఎదురుదాడికి దిగాల్సింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలి. ఆ తర్వాత బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాల్సింది.
ఇటీవల రికార్డ్ పరంగా కూడా ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం. ఎందుకంటే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలోనూ మూడు టెస్ట్‌ల్లో ఓటమిపాలైంది. ఇక్కడ తొలి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు బాట పట్టాల్సిన అవసరం ఉంది. కానీ టీమిండియా మాత్రం తమ వరల్డ్ బెస్ట్ పేసర్‌ను విశ్రాంతి పేరిట బయట కూర్చోబెట్టింది. ఈ నిర్ణయం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సాయి సుదర్శన్ తప్పించడం కూడా షాక్‌కు గురిచేసింది. తొలి టెస్ట్‌లో అతను బాగానే ఆడాడు. పాపం సాయి సుదర్శనతో పాటు కుల్దీప్ యాదవ్ చోటు కోసం వేచి చూడాల్సిందే.' అని రవి శాస్త్రి పేర్కొన్నాడు.