
ముంబై: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం క్రికెట్‌లో సంజూ శాంసన్ అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడని కొనియాడాడు. అయితే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అంచనాలను అందుకోవడంలో మాత్రం అతను విఫలమయ్యాడని చెప్పాడు. పెద్ద టోర్నీల్లో నిలకడగా రాణించలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ మాదిరిగా భారీ స్కోర్లు సాధించాలంటే మాత్రం శాంసన్ మరింత క్రమశిక్షణతో గేమ్‌ను ఆడాలని రవిశాస్త్రి సూచించాడు.
'ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్‌లో సంజూను గమనిస్తున్నా. ఎంతో కామ్‌గా ముందుకెళ్తున్నాడు. పరిణితి వృద్ధి చేసుకున్నాడు. ఈసారి ఎంతో స్థిరంగా పరుగులు చేస్తాడని భావిస్తున్నా. తన సహజసిద్ధమైన ఆటతో భారీ స్కోర్లు చేయగలడు. అయితే ప్రత్యర్థి బౌలర్లను రీడ్ చేయడాన్ని సంజూ నేర్చుకోవాలి. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాదిరిగా ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించి దేశం కోసం ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాలి'అని రవిశాస్త్రి ఆకాంక్షించాడు.


ప్రస్తుతం సంజూ సారథ్యంలోని రాజస్థాన్ (4) మూడింట్లో రెండు మ్యాచ్‌లను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా తరఫున చాలా మ్యాచ్‌లను ఆడగలిగే సత్తా సంజూ శాంసన్‌కు ఉందని పాక్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. "అద్భుతమైన ఆటగాళ్లలో సంజూ ఒకడు. దురదృష్టవశాత్తూ భారత జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. అయితే టీమ్‌ఇండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లను ఆడగలిగే సత్తా సంజూకు ఉందని నా అభిప్రాయం" అని అక్తర్ వివరించాడు. ఆర్‌సీబీతో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్ సూపర్ బ్యాటింగ్‌తో ఆ జట్టు విజయాన్నందుకుంది.