అచ్చం రోహిత్ శర్మలానే రవి బిష్ణోయ్.. ‘సూర్యుడు’మళ్లీ ఉదయిస్తాడంటూ సవాల్!

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లకు ఎంపికవ్వని యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సోషల్ మీడియా వేదికగా తన బాధను వెళ్లగక్కాడు. తనకు ప్రతికూలంగా మారిన పరిస్థితులతో పాటు సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. నేలకు కొట్టిన బంతిలా మళ్లీ దూసుకొస్తానని తెలిపాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తరహాలోనే సవాల్ విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఒకే ఒక మ్యాచ్ ఆడిన రవి బిష్ణోయ్.. ఆ తర్వాత శ్రీలంక, అప్ఘానిస్థాన్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో చోటు దక్కించుకోలేకపోయాడు. సీనియర్ పేసర్ రవిచంద్రన్ అశ్విన్ కారణంగా టీ20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపికవ్వలేదు. స్టాండ్ బై లిస్ట్‌కే పరిమితమయ్యాడు.

సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు..
దాంతో ఒకింత నిరాశకు లోనైన రవి బిష్ణోయ్.. సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా తన బాధను వెళ్లగక్కాడు. 'సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు.. మేం మళ్లీ ప్రయత్నిస్తాం' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. భారత జట్టులో చోటు దక్కపోవడంతోనే బిష్ణోయ్ ఇలా స్పందించాడని అభిమానులు భావిస్తున్నారు. సెలెక్టర్లు, ప్రతికూలంగా మారిన పరిస్థితుల పట్ల బిష్ణోయ్ ఎంత ఆగ్రహంగా ఉన్నాడనే విషయం ఈ పోస్ట్ ద్వారా తెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు. గతంలో భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సమయంలో రోహిత్ శర్మ సైతం ఇలాగే స్పందించాడు.

రోహిత్ సైతం..
2018లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్‌కు స్థానం దక్కలేదు. దీంతో 'సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడు' అంటూ హిట్ మ్యాన్ ట్వీట్ చేశాడు. కసితో ఆడిన రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలోనూ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవడమే కాకుండా.. ఐపీఎల్‌లో తిరుగులేని నాయకుడిగా పొందిన గుర్తింపుతో మూడు ఫార్మాట్లలో భారత జట్టు నాయకత్వ పగ్గాలను చేపట్టాడు. మరి రోహిత్‌లాగే రవి బిష్ణోయ్ కూడా భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడేమో చూడాలి.

అద్భుత ప్రదర్శనతో..
ఈ ఏడాది ఫిబ్రవరిలో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా రవి బిష్ణోయ్ భారత జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్ కంటే ముందు ఆగస్టులో వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో బిష్ణోయ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 8 వికెట్లు తీసిన ఈ యువ స్పిన్నర్.. చివరి టీ20లో 4 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో ఆసియా కప్ కోసం అతణ్ని ఎంపిక చేశారు. కానీ సూపర్ 4 దశలో పాకిస్థాన్‌పై మాత్రమే అతడికి ఆడే అవకాశం లభించింది.

సీనియర్ల కారణంగా..
ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రెండు బంతులు మాత్రమే ఆడిన బిష్ణోయ్ రెండు ఫోర్లు బాది 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం 4 ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులిచ్చిన బిష్ణోయ్.. కీలకమైన బాబర్ ఆజమ్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత శ్రీలంక, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో బిష్ణోయ్‌కు ఆడే అవకాశం రాలేదు. టీమిండియా మేనేజ్‌మెంట్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లవైపు మొగ్గు చూపడంతో ప్రపంచ కప్ సహా ఆసీస్, సౌతాఫ్రికాలతో సిరీస్‌ల్లో బిష్ణోయ్‌కు చోటు దక్కలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications