బజ్‌బాల్ క్రికెటర్లతో బౌలర్లకు కష్టాలే.. ప్రమాదంలో వన్డే క్రికెట్: అశ్విన్

న్యూఢిల్లీ: టెస్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ టీమ్ అనుసరిస్తున్న బజ్ బాల్ క్రికెట్ బౌలర్లకు ఆందోళన కలిగించే విషయమని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. రీషెడ్యూల్ టెస్ట్‌లో భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేధించడంతో ఈ బజ్ బాల్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. కెప్టెన్ బెన్‌స్టోక్స్ - కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ నేతృత్వంలో టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ ధాటిగా ఆడుతూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్ష్య ఛేదనను పూర్తి చేస్తోంది. అందుకే దీనిని మెక్‌కల్లమ్ నిక్‌నేమ్ 'బజ్' కలిసి వచ్చేటట్లు బజ్‌బాల్ క్రికెట్‌గా అభిమానులు పిలుస్తున్నారు. అయితే, అలాంటి పదమేమీ లేదని స్వయంగా బ్రెండన్ మెక్‌కల్లమ్ ప్రకటించినా.. దీనిపై క్రేజ్ పేరిగింది.

బౌలర్లకు కష్టమే..
తాజాగా రవిచంద్రన్ అశ్విన్ 'బజ్‌బాల్' క్రికెట్‌పై స్పందించాడు. ఇలాంటి దూకుడైన ఆటతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.'టెస్టు క్రికెట్‌లో దూకుడైన ఆటను చూడటం బాగుంది. అయితే, ఒక బౌలర్‌గా మాత్రం ఆందోళన కలిగించే అంశమే. ఇంగ్లండ్ వేగంగా పరుగులు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలి. ఎందుకంటే ఇక్కడ పిచ్ పాత్ర చాలా కీలకం. ఇలాంటి క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా టెస్టు ఫార్మాట్ ఒకేలా సాగుతోంది. అయితే దూకుడైన క్రికెట్‌ను ఎల్లకాలం ఆడగలమా? లేదా? అనేది కూడా చర్చనీయాంశమే'' అని అశ్విన్ పేర్కొన్నాడు.

ప్రమాదంలో వన్డే క్రికెట్
వన్డే క్రికెట్‌పైనా తన అభిప్రాయాలను అశ్విన్ వెల్లడించాడు. వన్డే క్రికెట్‌కు ప్రాధాన్యం పెంచాల్సిన అవసరముందని తెలిపాడు. 'వన్డే క్రికెట్ అందం దాని ఎత్తు పల్లాల్లో ఉండేది. జనం సమయం వెచ్చించి ఆటను చూసేవాళ్లు. వన్డే ఫార్మాట్లో ఒకప్పుడు బౌలర్లకూ కీలక పాత్ర ఉండేది'' అన్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆకర్షణను కోల్పోతున్న నేపథ్యంలో అశ్విన్ స్పందించాడు. ''వన్డే మ్యాచ్ చూస్తున్నప్పుడు ఓ దశ దాటిన తర్వాత నేనే టీవీ ఆపేస్తున్నా. ఫార్మాట్‌కు ఈ పరిణామం ప్రమాదకరం. హెచ్చు తగ్గులు లేకుంటే అది ఎంత మాత్రం క్రికెట్ కాదు. అది టీ20 క్రికెట్‌కు పొడిగింపు రూపం మాత్రమే'' అని అశ్విన్ చెప్పాడు.

మార్పులు చేయాలి..
వన్డే ఇన్నింగ్స్‌లో రెండు కొత్త బంతులు వాడకుండా, పాత పద్ధతిలో ఒకే బంతి వాడాలని అతడు సూచించాడు. వన్డే సిరీస్‌లకు బదులు మరిన్ని టీ20 లీగ్‌లు ఆడడం మంచిదని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి లాంటి వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బ్యాట్స్‌మన్ స్టాన్స్ మార్చుకుని స్విచ్ హిట్ ఆడిన సందర్భాల్లో బంతి లెగ్ స్టంప్ అవతలి లైన్‌లో పడ్డా కూడా అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాలని అశ్విన్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications