
న్యూఢిల్లీ: అండర్ 19 ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్‌పై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో యాశ్ ధుల్ సెంచరీతో చెలరేగాడు. అతని శతకాన్ని కొనియాడుతూ అశ్విన్ ట్వీట్ చేశాడు. ''కెప్టెన్ యశ్ ధుల్ తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అద్భుత ప్రయాణానికి ఇది నాంది అని చెప్పవచ్చు''అని పేర్కొన్నాడు.
అయితే ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ సెటైరిక్‌గా స్పందించగా అశ్విన్ అదిరిపోయే కౌంటరిచ్చాడు. భారత్‌కు 2012 అండర్ 19 ప్రపంకప్ అందించిన ఉన్మక్త్ చంద్‌ను గుర్తు చేస్తూ అశ్విన్ ట్వీట్‌పై సదరు నెటిజన్ సెటైర్లు పేల్చాడు. 'యశ్ ధుల్ మరో ఉన్ముక్త్ చంద్ కాకుంటే చాలు'అని కామెంట్ చేశాడు. దీనికి అశ్విన్ బదులిస్తూ.. ''కాస్త ఆశావాదాన్ని ప్రోత్సహించండయ్యా'' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
2012లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలోని భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. అప్పుడు కూడా ఉన్మక్త్ చంద్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. అయితే, జాతీయ జట్టు తరఫున ఆడాలన్న ఉన్ముక్త్ చంద్ కల మాత్రం నెరవేరలేదు. దేశవాళీ క్రికెట్‌లో రాణించినా అతనికి అవకాశం దక్కలేదు. చివరకు ఐపీఎల్‌లో కూడా సరైన అవకాశాలు దక్కలేదు. దాంతో తీవ్ర అసహనానికి గురైన ఉన్మక్త్ చంద్ రిటైర్మెంట్ ప్రకటించి అమెరికాకు వలస వెళ్లాడు. అక్కడ టీ20 లీగ్స్ ఆడుతూ.. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. తద్వారా 'బిగ్‌బాష్' లీగ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. కెప్టెన్ యష్ ధుల్ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్), వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించడంతో భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. లాచ్‌లాన్ షా(51) హాఫ్ సెంచరీ చేయగా.. కోరీ మిల్లర్(38), క్యాంప్‌బెల్ కెల్లావే(30)లు పర్వాలేదనిపించారు.