హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణంగానే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అన్నాడు. అతను లేకుండా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో టీమిండియాకు ప్రపంచకప్ గెలిచేది కాదని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.
ఈ క్రమంలో టీమిండియా విజయాన్ని కొనియాడిన రషీద్ లతీఫ్.. పాకిస్థాన్ ఆటగాళ్లను మందలించాడు. టీమిండియా విజయాన్ని చూసి పాకిస్థాన్ జట్టు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌లు తమ బ్యాటింగ్ అప్రోచ్‌ను మార్చుకోవాలని సూచించాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా తమ బ్యాటింగ్ అప్రోచ్ మార్చుకున్నారని గుర్తు చేశాడు. 'టీ20 క్రికెట్‌లో రోహిత్, కోహ్లీలే తమ బ్యాటింగ్ అప్రోచ్‌ను మార్చుకొని సక్సెస్ సాధించారు. మరీ బాబర్ ఆజామ్ ఎందుకు మార్చుకోవడం లేదు? రోహిత్ శర్మ ఆటనే ఉదాహారణగా తీసుకుందాం. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అతను ఎలా ఆడుతున్నాడో చూడవచ్చు.

అతను ఓ రోల్ మోడల్. ఈ ఐపీఎల్‌లో అతను 140 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అతను గేమ్ మార్చుకుంటే అందరూ మార్చుకుంటున్నారు. రాత్రికి రాత్రే అతను తన ఆటను మార్చుకోలేదు. దాని కోసం ఎంతో కష్టపడ్డాడు. అయితే ఇది ఆటగాళ్ల సమస్య కాదు. వారిని నడిపించేవారి సమస్య. బాబర్ ఆజామ్, రిజ్వాన్‌లకు నేను ఐదు మ్యాచ్‌లు సమయం ఇవ్వాలనుకుంటున్నాను.
ఆలోపు ఈ ఇద్దరూ తమ ఆటను మార్చుకుంటే జట్టులో కొనసాగించాలి. లేదంటే పక్కనపెట్టాలి. పాకిస్థాన్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ వంటి హెడ్ కోచ్ కావాలి. రాహుల్ ద్రవిడ్ లేకుంటే కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచకప్ గెలిచేవారు కాదు. ఈ ఇద్దరు ఐక్యంగా ఉండేలా చేసింది రాహుల్ ద్రవిడే. పాకిస్థాన్ జట్టులో బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిది విభేదాలు లేకుండా ఉండాలంటే ద్రవిడ్ లాంటి వ్యక్తి పాకిస్థాన్ జట్టుకు అవసరం.

అయితే ప్రతీ ఒక్కరికి ఈ విషయం గురించి తెలుసు. కానీ ఎవరూ మాట్లాడరు. ఈ ఇద్దరూ కలిసున్నప్పుడే పాకిస్థాన్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. వీలైనంత త్వరగా ఇది జరగాలి.'అని రషీద్ లతీఫ్ సూచించాడు.