భారత్ తప్పులు చేస్తే తప్పా.. పాకిస్థాన్ తలకిందులు తపస్సు చేసినా గెలవదు: పాక్ మాజీ క్రికెటర్

దుబాయ్: టీ20 ప్రపంచకప్ ఫలితం మొత్తం ఒక ఎత్తు అయితే.. భారత్, పాకిస్థాన్ ఫలితం మరో ఎత్తు. ఏళ్లకు ఏళ్లుగా ఇరు జట్ల మధ్య ఆట జరగకపోయినా.. ఆడే ఒకే ఒక్క మ్యాచ్‌తోనే వరల్డ్ క్రికెట్‌ను ఊపేస్తుంది. రిక్షా కూలీ నుంచి దేశ ప్రధాని వరకు అందరూ ఆసక్తిగా, అంతే ఉత్కంఠతో తిలకిస్తారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇండో-పాక్ పోరుకు సమయం వచ్చేసింది. సూపర్-12 గ్రూప్-2లో నేడు(ఆదివారం) ఇరుజట్ల మధ్య మరికొద్ది గంటల్లో అసలు పోరాట జరగనుంది.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలిసారిగా దాయాది దేశాలు పోటీపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దీంతో అటు ప్లేయర్లతో పాటు ఇటు ఇరుదేశాల అభిమానుల మధ్య ఇప్పటికే ఓ రకమైన వార్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ మ్యాచ్ ఫలితంపై అనేక అంచనాలు వెలువడ్డాయి. ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

తప్పులు చేస్తేనే..
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ తప్పులు చేస్తే తప్పా పాకిస్థాన్ విజయం సాధించలేదన్నాడు. తమ జట్టు ఎంత అద్భుత ప్రదర్శన కనబర్చినా, తలకిందులు తపస్సులు చేసినా గెలవలేదని, భారత్ అనవసర తప్పిదాలు చేస్తేనే విజయం వరిస్తుందని చెప్పుకొచ్చాడు. 'నా అభిప్రాయం ప్రకారం పాకిస్థాన్ ఎంత బాగా ఆడుతుందనేది ఇక్కడ అనవసరం. భారత ఆటగాళ్లు తప్పులు చేయకపోతే పాక్ విజయం సాధించడం కష్టం. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టు తప్పులు చేసే పరిస్థితులు కల్పించేవాడిని. అయితే ముందుగా మన బాధ్యతలను మనం నిర్వర్తించడం చాలా ముఖ్యం. కానీ అదే సమయంలో ప్రత్యర్థి జట్టు తప్పులు చేసేలా చేయడం కూడా ముఖ్యమే.

టీమ్ కాంబినేషన్ ఏంటో..
ఇది టెక్నిక్, స్కిల్స్‌తో సంబంధంలేదు. ఇది మనం రచించే వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగి సరిగ్గా అమలు చేస్తే ప్రత్యర్థి జట్టు తప్పులు చేయడం ఖాయం. ఇక బిగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ టాస్ గెలిస్తే ఏం చేస్తాడో? ఏ టీమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతాడో చూడాలి. సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇస్తాడా? లేక ఇషాన్ కిషన్‌కు చోటిస్తాడా? అలాగే ఏ స్పిన్నర్‌తో బరిలోకి దిగుతాడో? వరుణ్ చక్రవర్తీనా? రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో? అయితే ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు కెప్టెన్‌గా కోహ్లీ తప్పులు చేసే అవకాశం ఉంది'అని రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.

భారత్‌దే ఆదిపత్యం..
చరిత్ర పరంగా చూసినా, ఆట పరంగా చూసినా ఐసీసీ మెగా ఈవెంట్లలో ఎప్పుడూ భారత్‌దే పైచేయి. అన్ని మెగా టోర్నీల్లో కలిపి ఇరుజట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగితే అన్నింటిలోనూ టీమిండియానే గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీసేననే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. 2007 టీ20 ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారతే గెలవడం, ఇవన్నీ ధోనీ కెప్టెన్సీలో రావడం మరో విశేషం. ఇప్పుడు అదే ధోనీ మెంటార్‌గా రావడంతో జోష్, పోటీ రెట్టింపైంది. ఇరుజట్లు తమకు మరో మ్యాచ్ మాత్రమే అంటున్నా.. తెరవెనుక ఒత్తిడి మాత్రం ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో గెలుపు గీత దాటేదెవరో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications