
కరాచీ: టీమిండియా చేస్తున్న బ్యాటింగ్ ప్రయోగాలను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తప్పుబట్టాడు. అతిగా ప్రయోగాలు చేయడం వల్ల అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ కాంబినేషన్‌పై ఫోకస్ పెట్టిన టీమిండియా.. బ్యాటింగ్ స్థానాలను మారుస్తూ రొటేషన్ పద్దతిలో ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తోంది.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా దూకుడుగా ఆడే రిషభ్ పంత్‌ను రెండు మ్యాచుల్లో ఓపెనింగ్‌కు పంపించింది. ఒక మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన పంత్.. మరో మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ క్రమంలో టీమిండియా చేస్తున్న ఆటగాళ్ల బ్యాటింగ్ రొటేషన్‌పై రషీద్ లతీఫ్ స్పందించాడు.
'రిషభ్ పంత్‌ను టాపార్డర్‌లో ఆడించారు. అయితే పంత్ లోయర్ ఆర్డర్‌లో డేంజరస్ బ్యాటర్. పవర్‌ప్లేలో ఎవరైనా ధాటిగా ఆడగలరు. పది మందిలో తొమ్మిది మంది ఓపెనర్లే. కానీ అసలైన గేమ్ మిడిల్ ఓవర్లలోనే ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ లోయర్ ఆర్డర్‌లో 28 పరుగులే చేసినా.. అవి టాపార్డర్‌లో చేసిన 30 పరుగుల కంటే చాలా విలువైనవి. అందుకే టీమిండియా వ్యూహాలు మరీ అతిగా అనిపిస్తున్నాయి. లేకపోతే ఇంగ్లండ్ మీద 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకునేది'అని లతీఫ్ అభిప్రాయపడ్డాడు.
తరచూ తుదిజట్టును మారుస్తూ ఉండటం కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని లతీఫ్ చెప్పుకొచ్చాడు. 'రోహిత్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్ల విషయంలో ఇలా రొటేషన్ జరగదు. ఇప్పటి వరకు టీమిండియా జట్టు రూపకల్పన అంతా రోహిత్, కోహ్లీలను బేస్ చేసుకొని తయారైంది. వీరిద్దరూ ఫామ్‌లో లేకపోతే ఇతర ఆటగాళ్లు ఆ బాధ్యతను తీసుకొనేవారు. కానీ జట్టులో రొటేషన్ పద్ధతిని అతిగా అమలు చేయడం వల్ల ఎవరూ బాధ్యతను తీసుకొనే అవకాశం ఉండదు. అందుకే జట్టు ఓడితే దానికి కారణం రోహిత్, కోహ్లీనే కనిపిస్తారు'అని లతీఫ్ పేర్కొన్నాడు.