అఫ్గాన్ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్.. కొత్త సారథిగా మహమ్మద్ నబీ!

కాబుల్: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ ముందు అఫ్గానిస్థాన్ క్రికెట్‌లో కలకలం రేగింది. మెగాటోర్నీకి జట్టు సారథిగా ఎంపిక చేసిన రషీద్ ఖాన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే రషీద్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తనను సంప్రదించకుండానే ఆటగాళ్లను ఎంపిక చేసిందని.. సెలెక్షన్ కమిటీ, ఏసీబీ నా అనుమతి లేకుండానే జట్టును ప్రకటించిందని.. అందుకే తాను కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీటర్ వేదికగా పేర్కొన్నాడు. తన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు

టీమ్ సెలెక్షన్‌పై..
ఈ ఏడాది జులైలో ఏసీబీ చీఫ్ సెలెక్టర్ అసదుల్లా ఖాన్ రాజీనామా చేశారు. బోర్డులో చాలా అవకతవకలు జరుగుతున్నాయని.. క్రికెటేతరుల జోక్యం చాలా ఎక్కువైందని.. కనీసం క్రికెట్ అంటే కూడా అవగాహన లేని వ్యక్తులు, ఎంపిక ఎలా చేస్తారో తెలియని వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారని పేర్కొంటూ ఆయన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచే అఫ్గాన్ జట్టు ఎంపిక సరిగా జరగడం లేదని రషీద్ ఖాన్ కూడా అంటున్నాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో చాలా మంది గతంలో జాతీయ జట్టుకు ఆడిన క్రికెటర్లే. కానీ వీళ్లెవరూ ప్రస్తుతం జట్టులో రెగ్యులర్‌గా కొనసాగడం లేదు. ఏసీబీ ప్రకటించిన జట్టులో మహ్మద్ షహజాద్ కూడా ఉన్నాడు.

ఫామ్‌లో లేని ఆటగాళ్లు..
2019 ఆఖర్లో అతడిపై ఏడాది నిషేధాన్ని ఐసీసీ విధించింది. 2020 అగస్టు చివరిలో అతడి సస్పెన్షన్ పూర్తయ్యింది. కానీ అప్పటి నుంచి జట్టులో అతడు లేనే లేడు. ఇక పేసర్లు షాపూర్ జర్దాన్, దౌలత్ జర్దాన్‌లను కూడా ఎంపిక చేశారు. షాపూర్ 2020 మార్చిలో చివరి సారిగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక దౌలత్ 2019 సెప్టెంబర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. గాయంతో బాధపడుతున్న హమీద్ హసన్ 2016 మార్చి నుంచి టీ20 మ్యాచ్ ఆడలేదు. అతడిని కూడా జట్టులో చేర్చారు.

అసంతృప్తితోనే..
ఐసీసీ వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్‌కు వెళ్లే జట్టులో ఫామ్‌లో ఉన్న, ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిని ఎంపిక చేయకుండా.. గత రెండు మూడేళ్లుగా జట్టుకు దూరంగా ఉంటున్న వారిని చేర్చడంపై రషీద్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక ఐసీసీ నిబంధనల ప్రకారం.. 15 మంది క్రికెటర్లతో పాటు.. రిజర్వ్ ప్లేయర్లను కూడా ప్రకటించాల్సి ఉన్నది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐసీసీ నిబంధనలు మార్చింది. కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని 23 నుంచి 30 మంది క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ప్రకటించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ ఏసీబీ కేవలం 18 మంది ఆటగాళ్లను మాత్రమే ప్రకటించింది. దీనిపై కూడా రషీద్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.

నన్ను సంప్రదించకుండానే..
'ఒక కెప్టెన్‌గా, బాధ్యతాయుతమైన పౌరుడిగా తన జట్టు ఎంపికలో భాగస్వామ్యం అయ్యే హక్కు ఉంటుంది. అయితే సెలెక్షన్ కమిటీ, అఫ్గాన్ క్రికెట్ బోర్డు తన అంగీకారం లేకుండానే జట్టును ప్రకటించింది. నేను అఫ్గాన్ టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఈ నిర్ణయం వెంటనే అమలులోనికి వస్తుంది. అఫ్గానిస్తాన్‌కు ఆడటం నాకు ఎప్పుడూ గర్వకారణమే' అని రషీద్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రషీద్ ఖాన్ తప్పుకోవడంతో సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications