
ట్రినిడాడ్: మైదానంలో సెంచరీ చేసినా.. వికెట్ తీసినా.. క్యాచ్ పట్టినా ఆటగాళ్లు తమదైన శైలిలో సంబరాలు జరుపుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో అభిమానులకు కావాల్సిన మజాను అందిస్తారు. ముఖ్యంగా విండీస్ ఆటగాళ్లు యూనిక్ స్టైల్‌ను మెయింటేన్ చేస్తుంటారు. ఒకరు నోట్‌బుక్ సెలెబ్రేషన్ చేసుకుంటే ఇంకొకరు.. సెల్యూట్ చేస్తుంటారు. మరొకరు చిందిస్తేరు. ఇలానే బార్బోడస్ ట్రిడెంట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఆల్‌రౌండర్ కెవిన్ సింక్లెయిర్.. వికెట్ తీసిన ఆనందంలో జిమ్నాస్టిక్ విన్యాసాలతో అబ్బూరపరిచాడు.
అనంతరం సింక్లెయిర్(3) వికెట్ తీసిన రషీద్ ఖాన్ అదే రితిలో జిమ్నాస్టిక్ విన్యాసాలను ఇమిటేట్ చేస్తూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ మీడియం పేసర్ నవీన్ ఉల్ హక్(4/14) సూపర్ బౌలింగ్‌కు.. బ్రెండన్ కింగ్(51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ తోడవడంతో గయాన అమెజాన్ వారియర్స్ 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో గయాన పాయింట్ల టెబుల్స్‌లో మూడో స్థానానికి చేరింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బార్బోడస్ ట్రిడెంట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో మిచెల్ సాంట్నర్ (36) మినహా అందరూ విఫలమయ్యారు. ఓపెనర్లు ఇద్దరు చార్లెస్, జస్టిన్ గ్రేవ్స్ డకౌట్ కావడం గమనార్హం. నవీన్ ఉల్ హక్ బార్బోడస్ పతనాన్ని శాసించగా.. కెవిన్ సింక్లెయిర్ రెండు, కెప్టెన్ క్రిస్ గ్రీన్ ఒక వికెట్ తీశారు. కార్టర్, సాంట్నర్ ఇద్దరూ రనౌట్ అయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య చేధనకు దిగిన గయాన అమెజాన్ వారియర్స్.. 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 93 పరుగులు చేసి 8 వికెట్లతో సునాయసంగా గెలుపొందింది. బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్(18 నాటౌట్) చెలరేగగా.. సింక్లేర్(3), హెట్‌మైర్(9) విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో రషీద్ ఖాన్, వాల్ష్ చెరో వికెట్ తీశారు. విజయంలో కీలక పాత్ర పోషించిన నవీన్ ఉల్ హక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.