బ్యాటింగ్ వైఫ్యలం కారణంగానే టీమిండియా చేతిలో ఓటమిపాలయ్యామని అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా టీమిండియాతో గురువారం జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 47 పరుగులు తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) టాప్ స్కోరర్‌గా నిలిచారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/7), అర్ష్‌దీప్ సింగ్(3/36) అఫ్గాన్ పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రషీద్ ఖాన్.. ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయకపోవడమే ఓటమిని శాసించిందని చెప్పాడు. ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసిందన్న రషీద్ ఖాన్.. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేయాలని చెప్పాడు.
'పెద్ద జట్లతో ఆడుతున్నప్పుడు 160-170 పరుగుల లక్ష్యాలను ఛేదించగలుగుతాం. కాస్త తెలివిగా బ్యాటింగ్ చేసుంటే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించేవాళ్లం. నా బౌలింగ్ మళ్లీ మెరుగైంది. ఐపీఎల్ ఆరంభంలోనే నేను కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ సరైన ప్రదేశాల్లో నిలకడగా బంతిని హిట్ చేయడంతో మునపటిలా లయను అందుకున్నాను.
నా వ్యక్తిగత ప్రదర్శన సంతృప్తినిచ్చింది. కానీ దానికంటే మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యమైనది. మేం ఎక్కడైనా మా ఆటను ఆస్వాదిస్తున్నాం. అయితే మా ఆలోచన విధానం ఎలా ఉందనేదే ముఖ్యం. మేం పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సిన అవసరం ఉంది. పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే.. బ్యాటింగ్, బౌలింగ్ ట్రాక్ అయితే బౌలింగ్‌లో ఆ అడ్వాంటేజ్‌ను అందిపుచ్చుకోవాలి.'అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.