Rashid Khan: నా దేశాన్ని కాపాడండి.. అఫ్గాన్‌లను చంపడం ఆపండి!

కాబుల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ రక్తమోడింది. దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గాన్ల లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం చీకటి పడుతున్న వేళ ఆత్మాహుతి దాడులు జరిగాయి. రెండు బాంబుపేలుళ్లలో 72 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 143 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇది ఇస్లామిక్ స్టేట్ - ఖోరాసన్ (ఐసిస్-కె) ఉగ్రమూక దుశ్చర్యగా భావిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయానికి ఉగ్రముప్పు పొంచివుందని, ఆ పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని... సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని అమెరికా, బ్రిటన్ సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బాంబుల మోతతో కాబూల్ దద్దరిల్లింది.
నా దేశాన్ని కాపాడండి..
ఈ రెండు పేలుళ్లపై అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ట్విటర్ వేదికగా తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపాలని ఆవేదన వ్యక్తం చేశాడు. 'కాబుల్‌లో మరోసారి రక్తం చిందింది. దయచేసి అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపేయండి.'అంటూ రషీద్ ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నీళ్లు చిందిస్తున్న ఏమోజీలతో పాటు గుండె పగిలిన ఏమోజీలను ట్వీట్‌కు జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు రషీద్‌ను తమ కామెంట్లతో ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

అమెరికా ఫైర్..
ఇక కాబూల్ ఎయిర్‌పోర్ట్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగంగా ప్రసంగించారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ''బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. వాళ్లెవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ దాడిని అంతతేలికగా మేం మరిచిపోం. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం. ఐసిస్ నాయకుల ఏరివేత ఇక మొదలైనట్లే'' అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు.

చెలరేగుతున్నరషీద్..
ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీ ఆడుతున్న రషీద్.. దేశంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులను తన ఆటపై పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆ కసినంతా ప్రత్యర్థి జట్టుపై చూపిస్తున్నాడు. ఇప్పటిదాకా బంతితోనే సత్తా చాటుతూ వచ్చిన రషీద్ ఖాన్ ఈ సారి బ్యాట్‌తోనూ చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని విజృంభణ ఏ స్థాయిలో కొనసాగిందంటే- ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో జట్టును గెలిపించాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్ ఖాన్ యార్క్‌షైర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు.
హెలికాప్టర్ సిక్స్..
ముఖ్యంగా రషీద్ ఖాన్ కొట్టిన హెలికాప్టర్ సిక్స్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. జోర్డాన్ థాంప్సన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఆఫ్ స్టంప్ మీదుగా రషీద్ హెలికాప్టర్ సిక్స్ కొట్టాడు. అతని షాట్‌లో ఎంత కచ్చితత్వం అంటే ఫీల్డర్‌కు బంతి దొరికే చాన్స్ కూడా ఇవ్వకుండా గ్యాలరీలో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవరాల్‌గా రషీద్ 9 బంతులాడి మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 27 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్నందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications