టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తాను డైహార్డ్ ఫ్యాన్ అని జమ్మూకశ్మీర్ పేసర్ ఉమర్ నజీర్ అన్నాడు. అందుకే అతని వికెట్ తీసినా సంబరాలు చేసుకోలేదని చెప్పాడు. అతని పట్ల గౌరవంగా ఉండాలనుకుంటున్నానని నజీర్ పేర్కొన్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ వికెట్ తీయడం సంతోషంగా ఉందని తెలిపాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ.. రంజీ ట్రోఫీలోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. టీమిండియా అంతర్జాతీయ క్రికెటర్లు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కొత్త రూల్ తీసుకురావడంతో రోహిత్ శర్మ 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ మ్యాచ్ ఆడాడు.

ముంబై తరఫున జమ్మూకశ్మీర్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే వెనుదిరిగి తీవ్రంగా నిరాశపర్చాడు. 31 ఏళ్ల ఉమర్ నజీర్ మిర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ ఔటయ్యాడు. అతనితో పాటు రహానే(12), శివమ్ దూబే(0), హార్దిక్ టామోర్(7)లు కూడా ఉమర్ నజీర్ బౌలింగ్‌లోనే వెనుదిరిగారు.
ఈ సంచలన ప్రదర్శనతో అతను టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. రోహిత్ శర్మ వికెట్ తీసిన తర్వాత నజీర్ సంబరాలు చేసుకోలేదు. అందుకు గల కారణాన్ని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తెలియజేశాడు. 'నేను రోహిత్ శర్మకు డైహార్డ్ ఫ్యాన్‌ని. అందుకే అతని వికెట్ తీసినా సంబరాలు చేసుకోలేదు. ఈ మ్యాచ్‌లో మేం విజయం సాధిస్తే అది గర్వించదగ్గ విషయం. ప్రత్యర్థి జట్టులో భారత కెప్టెన్ ఆడుతున్నాడు.
మ్యాచ్‌కు ముందు చాలా ప్రశాంతంగా ఉన్నా.. మంచి బంతి వేస్తే ఎలాంటి బ్యాటరైనా ఇబ్బందిపడతాడు. క్రీజులో ఉన్నది ఎంత పెద్ద ఆటగాడనేది పట్టించుకోకుండా బౌలింగ్ చేయాలి. రోహిత్ శర్మ వికెట్ చాలా కీలకమైనది. అతన్ని ఔట్ చేసినందుకు సంతోషంగా ఉన్నా'అని నంజీర్ చెప్పుకొచ్చాడు.
ఉమర్ నజీర్ మిర్ సంచలన బౌలింగ్‌తో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్(57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51), తనూష్ కోటియన్(36 బంతుల్లో 5 ఫోర్లతో 26) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమ్ముకశ్మీర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 42 ఓవరల్లో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 54 పరుగుల ఆధిక్యంలో ఉంది.