ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రఫ్ఫాడించాడు. బీసీసీఐ నయా రూల్‌తో దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన జడేజా సౌరాష్ట్ర తరఫున అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఢిల్లీతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 12 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రకు ఘన విజయాన్ని అందించాడు.
జడేజా ధాటికి ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో (5/66) ఐదు వికెట్లు పడగొట్టిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో(7/38) ఏడు వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో 38 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దేశవాళీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన మిగతా ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా విఫలమవ్వగా.. జడేజా ఒక్కడే అసాధారణ ప్రదర్శన కనబర్చడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున రిషభ్ పంత్ బరిలోకి దిగగా.. రెండు ఇన్నింగ్స్‌ల్లో అతను విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ధర్మెంద్ర జడేజా బౌలింగ్‌లోనే ఔటవ్వగా.. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజాకు వికెట్ సమర్పించుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒక్క పరుగే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 49.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆయుష్ బదోని(60) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. హర్విక్ దేశాయ్(93), అర్పిత్ వసవడ(62) రాణించారు.
83 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 25.2 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. దాంతో సౌరాష్ట్ర ముందు 12 పరుగుల లక్ష్యమే నమోదవ్వగా.. సౌరాష్ట్రా 15 పరుగులు చేసి భారీ విజయాన్నందుకుంది.