టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన కోహ్లీ.. దేశవాళీ క్రికెట్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆల్టిమేటం జారీ చేయడంతో ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లీ.. 15 బంతుల్లో 6 పరుగులే చేసి వెనుదిరిగాడు. కోహ్లీ ఆడుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు.
12 ఏళ్ల తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో జియోసినిమా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ రజత్ భాటియా కోహ్లీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్ 2013లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర మధ్య జరిగిన గొడవను తానే ఆపానని తెలిపాడు. దాంతో జనాలు తనను క్రికెటర్‌గా కాకుండా ఈ గొడవ ఆపిన వ్యక్తిగానే గుర్తు పెట్టుకున్నారని వివరించాడు.

'మైదానంలో విరాట్ కోహ్లీ, గంభీర్ గొడవపడినప్పుడు నేనే ఆపాను. దాంతో ఈ గొడవను ఆపిన వ్యక్తిగానే జనాలు నన్ను గుర్తుపెట్టుకున్నారు. నా ఆట కంటే ఈ ఘటనే జనాలకు ఎక్కువగా గుర్తుంది. ఈ మైదానంలో(అరుణ్ జైట్లీ) కోహ్లీ పేరిట పెవిలియన్.. గంభీర్ పేరు మీద స్టాండ్ ఉంది(నవ్వుతూ). ప్రతీ జట్టులోనూ చిన్న చిన్న గొడవలు జరగుతుంటాయి. ఢిల్లీ రంజీ టీమ్‌లోనూ గొడవలు జరిగేవి. అయితే వాటిని కొనసాగించాల్సిన అవసరం ఏ ఆటగాడికి ఉండదు. ఈ రోజు టీమిండియాలో కోహ్లీ, గంభీర్ కీలక స్థానాల్లో ఉన్నారు. గంభీర్ హెడ్ కోచ్‌గా.. కోహ్లీ స్టార్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.'అని రజత్ భాటియా చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2013లో కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ .. ఆర్‌సీబీ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీతో గొడవపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేకేఆర్ ప్లేయర్‌గా మైదానంలో ఉన్న రజత్ భాటియా.. ఈ ఇద్దరి మధ్య అడ్డుగా నిలిచి గొడవను ఆపాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ లక్నో మెంటార్‌గా ఉన్న గంభీర్.. ఆర్‌సీబీకి ఆడుతున్న కోహ్లీతో గొడవపడ్డాడు. ఈ ఘటన కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ పాత విషయాలు మరిచి సన్నిహితంగా మెదులుతున్నారు.