టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగిన రంజీ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పోటెత్తారు. దాంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హజరయ్యారు. దాంతో స్టేడియం గేట్ నంబర్ 16 వద్ద పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారి తీసింది.
సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ తొక్కిసలాట కారణంగా పలువురు అభిమానులు గాయపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. అభిమానుల వస్తువులు చెల్లా చెదురుగా పడ్డాయి. ఓ పోలీస్ బైక్ కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మ్యాచ్‌కు కూడా లేనంతలా కోహ్లీ కోసం ఫ్యాన్స్ ఎగబడటంతో స్టేడియం కిక్కిరిసింది.

అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆల్టిమేటం జారీ చేసింది. దాంతో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రంజీ ట్రోఫీ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మెడ నొప్పితో గత రంజీ మ్యాచ్ ఆడని కోహ్లీ.. గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన ఆఖరి లీగ్ రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు.
ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడంతో ఫ్యాన్స్ పోటెత్తారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రవేశం కల్పించడంతో వేలాది సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఉదయం 3 గంటల నుంచే స్టేడియం బయట క్యూ కట్టారు. కోహ్లీ, ఆర్‌సీబీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీ స్టేడియంలోని ప్రతీ స్టాండ్ ప్రేక్షకులతో నిండిపోయింది. భద్రతా కారణాలతో కొంత మంది అభిమానులు పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది.
ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరవ్వడం ఇదే తొలిసారని కామెంటేటర్లు తెలిపారు. స్టేడియానికి భారీ సంఖ్యలో హాజరైన అభిమానులకు విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లీ రంజి ఆడుతున్న నేపథ్యంలో.. అతడిని చూడడానికి ప్రేక్షకులు భారీగా వచ్చారు.. దీంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఒకానొక దశలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. #ViratKohli𓃵 #Delhistadium #Ranjicricket #Delhivsrailways pic.twitter.com/CctzpoyvOG
— Anabothula Bhaskar (@AnabothulaB) January 30, 2025