ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 96 ఓవర్లలో 7 వికెట్లకు 334 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(15 బంతుల్లో 6) దారుణంగా విఫలమైనా.. కెప్టెన్ ఆయుష్ బదోని(77 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 99) జట్టును ఆదుకున్నాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నా.. టీ20 తరహా బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అతనికి తోడుగా సుమిత్ మథుర్(189 బంతుల్లో 7 ఫోర్లతో 78 బ్యాటింగ్) రాణించాడు. లోయరార్డర్ బ్యాటర్ ప్రణవ్ రాజ్‌వంశీ(90 బంతుల్లో 7 ఫోర్లతో 39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సుమిత్ మథుర్‌తో పాటు సిద్దాంత్ శర్మ(15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఆధిక్యం 93 పరుగులకు చేరింది. సౌరాష్ట్ర బౌలర్లలో హిమాన్షు సంగ్వాన్, కునాల్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ శర్మ, అయాన్ చౌదరి, కర్ణ్ శర్మ తలో వికెట్ తీసారు.

అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆల్టిమేటం జారీ చేయడంతో 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 15 బంతుల్లో 6 పరుగులే చేసి వెనుదిరిగాడు.
హిమాన్షు సంగ్వాన్ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌ను కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి.. ప్యాడ్ గ్యాప్ నుంచి దూసుకెళ్లి ఆఫ్ సైడ్ వికెట్‌ను లేపేసింది. ఈ డెలివరీకి కోహ్లీ బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. కోహ్లీ కోసం స్టేడియానికి పోటెత్తిన అభిమానులు.. అతని వైఫల్యంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
కోహ్లీ విఫలమైనా.. కెప్టెన్ ఆయుష్ బదోనీ, సుమిత్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం ఢిల్లీకి ఆధిక్యాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ 241 పరుగులకు ఆలౌటైంది. ఉపేంద్ర యాదవ్(177 బంతుల్లో 10 ఫోర్లతో 95) శతకం చేజార్చుకోగా.. కర్ణ్ శర్మ(105 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, సుమిత్ మూడేసి వికెట్లు తీయగా.. సిద్దాంత్, మనీ గ్రేవల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.