ప్రతీష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా విదర్భతో జరుగుతున్న సెమీఫైనల్లో ముంబై బౌలర్లు తేలిపోయారు. సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో 5 వికెట్లకు 308 పరుగులు చేసింది. ధ్రువ్ షోరే(109 బంతుల్లో 9 ఫోర్లతో 74), డానిష్ మలెవర్(157 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 79) తృటిలో శతకాలు చేజార్చుకోగా.. కరుణ్ నాయర్(70 బంతుల్లో 6 ఫోర్లతో 45), యశ్ రాథోడ్(86 బంతుల్లో 6 ఫోర్లతో 47 బ్యాటింగ్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
యశ్ రాథోడ్‌తో పాటు కెప్టెన్ అక్షయ్ వాడ్కర్(13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ముంబై బౌలర్లలో షామ్స్ ములాని(2/44), శివమ్ దూబే రెండేసి వికెట్లు తీయగా.. రోస్టన్ డైస్ ఓ వికెట్ పడగొట్టాడు.

చెలరేగిన ధ్రువ్ షోరే..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే ఓపెనర్ అథర్వ టైడ్(4)ను రోస్టన్ డైస్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పార్థ్ రేఖడే(23)తో కలిసి ధ్రువ్ షోరే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని శివమ్ దూబే విడదీసాడు. పార్థ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. డానిష్ మలెవర్ బ్యాటింగ్‌కు రాగా.. ధ్రువ్ షోర్ తన నిలకడను కొనసాగించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడి మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగిన ధ్రువ్ షోరేను షామ్స్ ములాని ఔట్ చేశాడు.
మలుపుతిప్పిన మలెవర్..
దాంతో కరుణ్ నాయర్ బ్యాటింగ్‌కు రాగా.. డానిష్ మలెవర్ తన జోరును కొనసాగించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను దూకుడుగా ఆడాడు. మరోవైపు కరణ్ నాయర్ కూడా వేగంగా పరుగులు చేయడంతో విదర్బ స్కోర్ బోర్డు పరుగెత్తింది. హాఫ్ సెంచరీ ముంగిట కరుణ్ నాయర్‌ను శివమ్ దూబే పెవిలియన్ చేర్చడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. యశ్ రాథోడ్ క్రీజులోకి రాగా.. డానిష్ తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు.
అయితే సెంచరీ దిశగా సాగిన అతని ఇన్నింగ్స్‌కు షామ్స్ ములానీ కీపర్ క్యాచ్‌తో తెరదించాడు. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించాడు. తొలి రోజు ఆటలో ముంబై బౌలర్లు శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థ, తనూష్ కోటియన్ దారుణంగా విఫలమయ్యారు. ధారళంగా పరుగులిచ్చుకున్నారు.