ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024లో తిలక్ వర్మ తన జోరును కొనసాగిస్తున్నాడు. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా సిక్కింతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 62 ఓవర్లలో 3 వికెట్లకు 381 పరుగులు చేసింది.
ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(126 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 137) సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సింగ్(64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83), రోహిత్ రాయుడు సైతం(111 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నారు.

ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ(66 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 బ్యాటింగ్), చందన్ సాహని(8 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆధిక్యం 300 ధాటింది. సిక్కిం బౌలర్లలో అంకుర్ మాలిక్ రెండు వికెట్లు తీయగా.. లీ యంగ్ లెప్చా ఓ వికెట్ తీసారు.
అంతకుముందు సిక్కిం తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే కుప్పకూలింది. తనయ్ త్యాగరాజన్(6/25) 6 వికెట్లు తీయగా.. చామ మిలింద్ 4 వికెట్లు పడగొట్టాడు. సిక్కిం బ్యాటర్లలో అంకుర్ మాలిక్(17), ఆశిష్ తాప(14) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్ వన్డే తరహా బ్యాటింగ్‌తో సిక్కిం బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో హైదరాబాద్ 18 ఓవర్లలో 130 ప్లస్ రన్స్ చేసింది. సెంచరీకి చేరువైన రాహుల్ సింగ్‌ను అంకుర్ మాలిక్ క్లీన్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు నమోదైన 132 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన రోహిత్ రాయుడు కూడా అదే జోరు కొనసాగించగా..తన్మయ్ అగర్వాల్ శతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం భారీ సిక్సర్లతో విరుచుకపడిన అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 138 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, రోహిత్ రాయుడు చెలరేగారు. రోహిత్ రాయుడు ఔటైనా.. తిలక్ వర్మ ధాటిగా ఆడుతూ తొలి రోజును ముగించాడు.
అఫ్గాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో రెండో మ్యాచ్‌కు దూరమైన తిలక్.. వెంటనే హైదరాబాద్ జట్టుతో కలిసిపోయాడు. సూపర్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. రెండో మ్యాచ్‌లా ఈ మ్యాచ్ కూడా రెండు రోజుల్లోనే ముగిసే అవకాశం ఉంది.