ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024లో ముంబై, తమిళనాడు, మధ్యప్రదేశ్, విదర్భ జట్లు సెమీఫైనల్ చేరాయి. సౌరాష్ట్రను ఓడించిన తమిళనాడు.. కర్ణాటకను చిత్తు చేసిన విదర్భ.. ఆంధ్ర జట్టుపై గెలిచి మధ్యప్రదేశ్ సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
ఇక బరోడాతో డ్రా చేసుకున్న ముంబై టోర్నీ నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా నాలుగో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. బరోడా వర్సెస్ ముంబై క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఆధిక్యం అందుకున్న ముంబై జట్టు టోర్నీలో ముందు అడుగువేసింది.

ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు రికార్డుల మోత మోగించారు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 384 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్(203 నాటౌట్) డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులే చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 569 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ముంబై 10, 11వ బ్యాటర్లు తనుష్ కొటియన్(120 నాటౌట్) తుషార్ దేశ్‌పాండే(123) శతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన బరోడా 121/3 స్కోర్‌తో చివరి రోజు ఆటను ముగించడంతో మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇతర మ్యాచ్‌ల్లో విదర్భపై 127 పరుగులతో కర్ణాటక, సౌరాష్ట్రపై 33 పరుగుల తేడాతో తమిళనాడు, 4 పరుగుల తేడాతో ఆంధ్రపై మధ్యప్రదేశ్ విజయం సాధించాయి. ఏడేళ్ల తర్వాత తమిళనాడు రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ చేరింది.
దిగొచ్చిన అయ్యర్..
మార్చి 2-6 మధ్య విదర్భ వర్సెస్ మధ్యప్రదేశ్ మధ్య తొలి సెమీఫైనల్, ముంబై వర్సెస్ తమిళనాడు మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. సెమీఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. సెమీఫైనల్ ఆడేందుకు సిద్దంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్లకు సమాచారమిచ్చాడు.
అయితే ఐపీఎల్ 2024 ప్రిపరేషన్ కోసం ఫిట్‌నెస్ సమస్యలు అంటూ రంజీ క్రికెట్‌కు దూరంగా ఉన్నా శ్రేయస్ అయ్యర్.. బోర్డు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తమిళనాడు తరఫున సెమీస్ ఆడేందుకు వాషింగ్టన్ సుందర్ కూడా సిద్దమవుతున్నాడు.