ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ హైదరాబాద్ తన జోరును కొనసాగిస్తోంది. గతేడాది పేలవ ప్రదర్శనతో ప్లేట్ గ్రూప్‌లో ఆడుతున్న హైదరాబాద్ ఇప్పటికే వరుసగా మూడు విజయాలు నమోదు చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం ప్రారంభమైన నాలుగో మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.
టీ20 తరహా బ్యాటింగ్‌తో చెలరేగింది. హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సర్లతో 323 నాటౌట్) ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో మార్కో 191 బంతుల్లో 300 రన్స్ సాధించాడు. అయితే తన్మయ్ 147 బంతుల్లో ఈ ఫీట్ సాధించి అతని రికార్డును బ్రేక్ చేశాడు.
అంతకుముందు 119 బంతుల్లోనే 200 పరుగుల మార్క్‌ను అందుకున్న తన్మయ్.. రవి శాస్త్రి పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును అధిగమించాడు. అతనికి తోడుగా రాహుల్ సింగ్(105 బంతుల్లో 26 ఫోర్లతో 3 సిక్స్‌లతో 185) శతక్కొట్టడంతో హైదరాబాద్ 48 ఓవర్లలో వికెట్ నష్టానికి 529 పరుగులు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ 172 పరుగులకు ఆలౌటైంది. చామా మిలింద్, కార్తీకేయ మూడేసి వికెట్లు తీయగా.. తనయ్ త్యాగరాజన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఎల్లిగరమ్ సాంకేత్, పాలకోడేటీ సాయిరామ్ తలో వికెట్ తీసారు. అయితే ఈ మ్యాచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో క్వాలిటీ మిస్సవుతుందని విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.