ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పేలవ ప్రదర్శనతో ప్లేట్ గ్రూప్‌లోకి పడిపోయిన హైదరాబాద్.. మేఘాలాయతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్.. రెండు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మేఘాలయ 33.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ కిషన్ లింగ్డో(51) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో సాకేత్ సాయిరామ్(4/33) నాలుగు వికెట్లు తీయగా.. సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రవితేజ తలో రెండు వికెట్లు తీసారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 346 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

రోహిత్ రాయుడు(124 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. చందన్ సహానీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సీవీ మిలింద్ (38 బంతుల్లో 50 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన మేఘాలయ 154 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం పాలైంది.
తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 194 పరుగుల భారీ తేడాతో నాగాలాండ్‌ను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను తిలక్ వర్మ నడిపించగా.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్ కారణంగా అతను రెండో టెస్ట్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అతని గైర్హాజరీలో రాహుల్ సింగ్ గహ్లోత్ హైదరాబాద్ జట్టును నడిపిస్తున్నాడు.
ఎలైట్ గ్రూప్‌లో మణీపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో విదర్భ ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మణిపూర్ 75 పరుగులకు కుప్పకూలింది. అనంతరం విదర్భ 230 పరుగులకు ఆలౌటైంది. 155 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మణిపూర్ 65 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది.