
ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మరోసారి టాప్ ట్రెండింగ్‌లో నిలిచాడు. ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్.. రంజీ ట్రోఫీ 2022 బరిలోకి దిగాడు. ముంబై జట్టు తరఫున ఆడుతున్న సూర్య.. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 15 ఫోర్లు, సిక్సర్‌తో వీరవిహారం చేసిన సూర్య.. 80 బంతుల్లో 90 పరుగులు చేశాడు.
తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో మైదానం నలువైపులా బంతిని బాదిన సూర్య.. ఒకే ఓవర్‌లో వరుసగా 4 ఫోర్లు బాది ఔరా అనిపించాడు. మూడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఫార్మాట్ ఆడుతున్న సూర్య.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టి తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. అయితే, దాటిగా ఆడిన సూర్య సెంచరీ మాత్రం పూర్తి చేయలేకపోయాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శశాంక్ మల్హోత్రా అతన్ని ఔట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్లకు 457 పరుగులు చేసింది. సూర్య సూపర్ ఇన్నింగ్స్‌కు మించి.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(195 బంతుల్లో 27 ఫోర్లు, సిక్సర్‌తో 162), అజింక్యా రహానే(190 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 139 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. రహానేతో పాటు సర్ఫరాజ్ ఖాన్(40 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో శశాంక్ రెండు వికెట్లు తీయగా.. కార్తీకేయ కాక్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇక సూర్య ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
భారత్ తరఫున టెస్ట్ ఫార్మాట్ ఆడాలని ఇటీవలే అతడు తన కోరికను వ్యక్తం చేశాడు. 'నేను టెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఈ విషయం చెప్పాను. అది నా కల అని ద్రవిడ్‌కు తెలుసు. గతేడాది న్యూజిలాండ్ సిరీస్‌లో నేను నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం కూడా ఆయన చూశారు. నా బ్యాటింగ్ చూసి, బాగా ఆడుతున్నావు అని ప్రోత్సహించారు. కొన్ని సూచనలు కూడా చేశారు' అని సూర్య అన్నాడు.