
ఆలూర్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో బెంగాల్ తరఫున ఆడుతున్న ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారీ (182 బంతుల్లో 9 ఫోర్లతో 84 బ్యాటింగ్) పోరాడుతున్నాడు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు సాధించింది. ఒకదశలో 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను మనోజ్ తివారీ, షాబాజ్ అహ్మద్ (149 బంతుల్లో 9 ఫోర్లతో 72 బ్యాటింగ్) ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జోడించారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 271/6తో బుధవారం ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 105.3 ఓవర్లలో 341 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హిమాన్షు ( 327 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 165) భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన మనోజ్ తివారీ.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. తృణమూల్ ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా వ్యవహరిస్తున్న తివారీ.. బెంగాల్ రంజీ జట్టు తరఫున దేశవాళీ కెరీర్ కొనసాగిస్తున్నాడు. జార్ఖండ్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మనోజ్ తివారి(185 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 136) సెంచరీతో రాణించి బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న బెంగాల్ మంత్రి.. మళ్లీ ఐపీఎల్‌లో బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
తమోరే సెంచరీ.. ముంబై 393
ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో ముంబై పటిష్ట స్థితిలో నిలిచింది. హార్దిక్ తమోరే(115) సెంచరీతో రాణించడంతో.. బుధవారం రెండో రోజు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 393 స్కోర్‌కు ఆలౌటైంది. శామ్స్ ములానీ(50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కరణ్ శర్మ 4 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యూపీ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 25/2 స్కోర్ చేసింది. మాథవ్ కౌశిక్(11 బ్యాటింగ్), కరణ్ శర్మ(10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.