టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్‌లోనే కాకుండా అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శత్రు దేశం పాకిస్థాన్‌లో కూడా కోహ్లీ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది.
అయితే గత రెండు-మూడేళ్లుగా విరాట్ కోహ్లీ నిలకడలేమి ఆటతో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా గత 6 నెలలుగా అతని ప్రదర్శన మరీ పేలవంగా మారింది. పెర్త్ టెస్ట్ సెంచరీ మినహా కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టులో నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది.

కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు కూడా విఫలమవడంతో టీమిండియా ఘోర పరాజయాలను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆల్టిమేటం జారీ చేసింది. దాంతో సీనియర్ ఆటగాళ్లంతా రంజీ బరిలో నిలిచారు. అయితే మెడ నొప్పి గాయంతో గత రంజీ మ్యాచ్ ఆడని కోహ్లీ.. గురువారం ప్రారంభమైన ఆఖరి లీగ్ రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.
సౌరాష్ట్రతో ఢిల్లీలో అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడంతో ఫ్యాన్స్ పోటెత్తారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రవేశం కల్పించడంతో అభిమానులు స్టేడియానికి క్యూ కట్టారు. కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నా.. అతనిపై అభిమానం మాత్రం ఏం తగ్గలేదని ఈ మ్యాచ్ ద్వారా నిరూపితమైంది.
భారీ సంఖ్యలో అభిమానులు హాజరవ్వడంతో అరుణ్ జైట్లీ స్టేడియం బయట క్యూ లైన్ రెండు కిలోమీటర్ల మేర ధాటింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలపై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. క్రేజ్‌కా బాప్ కోహ్లీ అని, కోహ్లీపై అభిమానం తగ్గేదేలే అని పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్.. ఆర్‌సీబీ అని అరుస్తూ.. తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు. 'లవ్ యూ కోహ్లీ'అనే ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. నవ్‌దీప్ సైనీ ఓ వికెట్ తీయగా.. సిద్దాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. కోహ్లీ కోసమే ఈ మ్యాచ్‌ను జియోసినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటం విశేషం. ముందుగా ఈ మ్యాచ్‌కు లైవ్ లేకపోగా.. కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అతని క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు జియో సినిమా ముందుకు వచ్చింది.
The 2 KM long queue at the outside of Arun Jaitley stadium for Virat Kohli's Ranji Match. 🤯🥶
— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025
- KING KOHLI, THE BIGGEST BRAND IN CRICKET...!!!! 🐐
pic.twitter.com/zZVth4jmNe