
కరాచీ: ప్రస్తుతం ప్రపంచక్రికెట్‌ను శాసించే స్థాయిలో భారత్ ఉందన్నా.. దేశంలో క్రికెట్ మతంలా మారిందన్నా.. దానికి కారణం కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలవడమే. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన కపిల్ దేవ్ సేన.. 17 రోజుల్లో చరిత్రను తిరగరాసి జగజ్జేతగా నిలిచింది. ఈ చిరస్మరణీయ విజయం అందుకొని 37 ఏళ్లైనా.. ఆ మ్యాచ్‌ను మనం చూడకపోయినా.. ఈ టోర్నీ ప్రస్తావన వస్తే చాలు లార్డ్స్ మైదానంలో సిల్వర్ కలర్‌లోని ప్రపంచకప్ అందుకుంటూ కపిల్ ఇచ్చిన స్మైల్.. మన కళ్లముందు కదలాడుతుంటుంది.
అలాంటి చిరస్మరణీయ విజయాన్నందించిన ఆటగాళ్లకు ఇచ్చిన మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా..? కేవలం రూ. 2100. అవును ఇప్పుడంటే స్పాన్సర్లు, బ్రాడ్ క్రాస్టర్లతో క్రికెట్ కొత్తపుంతలు తొక్కడంతో ఆటగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు కానీ.. అప్పట్లో ఇదంతా లేదు. మ్యాచ్ ఫీజు రూ. 1500, డైలీ అలవెన్స్ రోజుకు రూ.200 చొప్పున.. ఒకే వన్డేకు రూ.600 ఇచ్చేవారు. దీంతో ఆటగాళ్లకు మొత్తం రూ.2100 అందేవి. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్ల పే స్లిప్‌ను రమీజ్ రాజా ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా తమకు 1986-87 లో భారత్ పర్యటనలో 5 టెస్ట్, 6 వన్డేలకు కలిపి పాకిస్థాన్ కరెన్సీలో రూ. 55000 వేలు ఇచ్చారని తెలిపాడు.
ఇక భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ తెగవైరల్ అయింది. అయితే కొందరు మాత్రం రమీజ్ రాజాకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. అప్పట్లో ఇది చాలా పెద్ద అమౌంట్.. అని రూ.55000 పెడితే 100 ఎకరాల భూమి వచ్చేదని, ఇప్పటి లక్షల రూపాలతో సమానమని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. నీ కెరీర్‌లో 2 సెంచరీలే చేసినా చాలా ఏళ్లు ఆడావని.. ఇప్పుడైతే జట్టులో చోటు కూడా ఉండేది కాదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా అప్పటి ఇప్పటికీ ఉన్న విలువతో పోలిస్తే రమీజ్ రాజాకు ఇచ్చిన 55000, రూ.15 లక్షలతో సమానమని బదులిస్తున్నారు.